Delhi Highcourt : భార్యను సరిగా చూసుకోకపోవడమేగాక పలు విధాలుగా చిత్రహింసలు పెట్టి, ఇతరులతో శృంగారానికి బలవంతం చేసిన భర్తకు బెయిలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi Highcourt) నిరాకరించింది. నిందితుడిపై అత్యాచారం, సామూహిక అత్యాచార యత్నం, లైంగిక వేధింపులు, క్రూరమైన ప్రవర్తన, విశ్వాసాన్ని భంగపరచడం లాంటి అభియోగాలు నమోదై ఉన్నందున అతడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు ససేమిరా అంది.
ఇది సాధారణ వైవాహిక వేధింపుల కేసు కాదని నిందితుడి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ గిరీశ్ కథపాలియా వ్యాఖ్యానించారు. కేసు వివరాల ప్రకారం.. మరిది లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పినా భర్త నిర్లక్ష్యం చేసేవాడని, మాట వినకపోతే బ్లేడుతో నా చేతులను గాయపర్చి అలాగే వంట చేయించేవాడని, హోటల్‌కు తీసుకువెళ్లి స్నేహితులతో శృంగారంలో పాల్గొనమని బలవంతం చేస్తే తప్పించుకొని వచ్చానని బాధితురాలు ఫిర్యాదు చేసింది.
నిందితుడు తన భార్య ఫొటోలతో నకిలీ ఇన్‌స్టా ఐడీ సృష్టించి.. ‘డబ్బులిచ్చి ఎవరైనా శృంగారంలో పాల్గొనవచ్చు’ అంటూ ఆన్లైన్ ఆఫర్ ప్రకటించినట్లు బాధితురాలు కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకొన్న హైకోర్టు నిందితుడికి బెయిలు మంజూరుకు నిరాకరించింది. అతడి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.