Gold Rates | న్యూఢిల్లీ, జూన్ 17: బంగారం ధరలు దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు భారీగా తగ్గాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.1,200 దిగొచ్చి రూ.1,00, 170గా నమోదైంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర లక్ష రూపాయల దిగువకు పడిపోయింది. పదిగ్రాముల ధర రూ.1,100 తగ్గి రూ.99,450కి చేరుకున్నది. ఇజ్రాయిల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో మదుపరులు అప్రమత్తతకు మొగ్గుచూపారని, దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆభరణాలకు డిమాండ్ గణనీయంగా పడిపోయిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. కానీ, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి రూ.100 అందుకొని రూ.1,07,200కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3,380.65 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, వెండి 36.47 డాలర్ల వద్ద ఉన్నది. అమెరికా ఫెడరల్ రిజర్వు తన పరపతి సమీక్ష సమావేశం కంటే ముందురోజు అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం విశేషమని గాంధీ చెప్పారు. అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు.