Jogulamba Gadwal | గద్వాల, జూన్ 18 : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడ గ్రామానికి వెళ్తున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మన్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండీ సుభాన్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కా బాలయ్య, వెంకటేశ్‌లను బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఎర్రవల్లి చౌరస్తాలో అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం ఇటిక్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన పౌర హక్కుల సంఘం నేతలను వెంటనే విడుదల చేయాలని ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ శంకర ప్రభాకర్ డిమాండ్ చేశారు.
పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం నేతలను అడ్డుకోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. ఈ అక్రమ అరెస్టులను ప్రజా సంఘాలు, విద్యార్థి, కార్మిక కర్షక, మేధావులు ఖండించాలని ఆయన అన్నారు.