Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాల్సిన దేవి శ్రీ ప్రసాద్ స్థానంలో థమన్‌ని ఎంపిక చేసినట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలికినట్టైంది. ఈ మార్పు వెనుక దేవిశ్రీ ప్రసాద్‌కు, చిత్ర యూనిట్‌కు మధ్య ఎలాంటి సృజనాత్మక విభేదాలు లేవని మేకర్స్ స్పష్టం చేశారు. పూర్తిగా సమయాభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
చిత్ర బృందం నిర్ణీత సమయానికి అవసరమైన కంటెంట్‌ను డీఎస్పీకి అందించలేకపోవడం, అలాగే ఆయన ఇతర భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో పనుల్లో ఆలస్యం జరుగుతుందని భావించి, విడుదలలో జాప్యం రాకుండా ఉండేందుకు తమన్‌ను రంగంలోకి దించారు. తాజాగా విడుదల చేసిన అధికారిక నోట్లో విడుదల తేదీని స్పష్టంగా ప్రస్తావించకపోయినా, ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే మేకర్స్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు శక్తివంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం కానుందని భావిస్తున్నారు. మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మ్యూజిక్ విభాగంలో జరిగిన ఈ మార్పు ఇండస్ట్రీలో చర్చనీయాంశమవగా, తమన్ ఎలాంటి స్కోర్‌తో అభిమానులను ఆకట్టుకుంటాడో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.