రంగారెడ్డి, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఫ్యూచర్‌సిటీ కోసం ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును నిర్మిస్తుండడంతో బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారాన్ని తేల్చక పనులు చేపట్టడంపై వారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రేవంత్ సర్కార్ 330 ఫీట్ల వెడల్పుతో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులను ప్రారంభించింది. గ్రీన్‌ఫీల్డ్ మొదటి దశ, ఔటర్ రింగ్ రోడ్డు రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు 19.02 కిలోమీటర్ల దూరం చేపట్టింది. ఇందుకోసం రూ. 1665 కోట్లను విడుదల చేసింది. మొదటి దశలో చేపట్టే రహదారికోసం సుమారు 500 ఎకరాల వరకు అవసరం ఉండగా.. అందులో 400 ఎకరాల వరకు పట్టా భూములున్నాయి.
అందులో కొందిమంది రైతులు మాత్రమే తమ భూములను ఇచ్చేందుకు సమ్మతిస్తూ అధికారులకు అంగీకార పత్రాలిచ్చారు. మిగిలిన రైతులు మాత్రం తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని.. లేదంటే మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది రైతులు ఏకంగా కోర్టును ఆశ్రయించి భూసేకరణపై స్టే ఆర్డర్‌ను తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వం భూసేకరణ పూర్తిస్థాయిలో చేపట్టకుండానే ముందుగా ప్రభుత్వ భూముల నుంచి రోడ్డు పనులను ప్రారంభించింది. ముం దుగా మీర్ఖాన్పేట నుంచి తిమ్మాపూర్ వచ్చే దారిలో ఉన్న ప్రభుత్వ భూముల్లో రెండుచోట్ల పనులను ప్రారంభించింది. ఈ పనులను బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కంపెనీకి ప్రభుత్వం కేటాయించింది. అధికారులు పట్టా భూముల్లోనూ పనులు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. కాగా, పరిహారం విషయాన్ని తేల్చకుండా తమ భూముల్లో రోడ్డు పనులను చేపట్టొద్దని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిహారమిచ్చాకే పనులు చేపట్టాలి..
టాటా రతన్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం బలవంతంగా భూములను సేకరి స్తున్నది. భూసేకరణపై రైతులకు చెల్లించే పరిహారంపై నేటికీ తేల్చక ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండో విడతలో 22 కిలోమీటర్లు..
అలాగే, రెండో విడత గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో 22 కిలోమీటర్లు చేపట్టనున్నారు. మీర్ఖాన్పేట నుంచి ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి వరకు 22 కిలోమీటర్ల రోడ్డు కోసం ప్రభుత్వం రూ. 2,365కోట్లను కేటాయించింది. ఈ రోడ్డు ఏర్పాటుకూ మరో 500 ఎకరాలు అవసరముందని అధికారులు గుర్తించారు. మొత్తం 41 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్రోడ్డుకు సుమా రు వెయ్యి ఎకరాలు భూమి అవసరం కానుండగా.. దాదాపుగా సుమారు 4000 మంది కిపైగా రైతులు తమ భూములను కోల్పోనున్నారు. పరిహారం విషయంలో అధికారులు పలుమార్లు రైతులతో చర్చలు జరిపినా వారు అంగీకార పత్రాలు ఇవ్వడంలేదు. పరిహారం విషయాన్ని ఎటూ తేల్చని ప్రభుత్వం బలవంతంగానైనా భూసేకరణ చేపట్టేందుకు యత్నిస్తున్నట్లు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.