Harish Rao | కరువు పరిస్థితులపై విలేకర్లు ప్రశ్నిస్తే మీ పీకలు కోసి రక్తం చల్లితే వానలు పడతాయి అని మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సైకో రాజ్ కుమార్కు ఏమైనా తేడా ఉందా..? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటేనా ఇదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఫైర్ అయ్యారు. నారాయణఖేడ్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. కోస్తాం, రక్తం చల్లుతాం అని హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి మీద డీజీపీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదన్నారు..
పోలీసులు కండ్లు మూసుకున్నారా? చట్టం సామాన్యుడికైనా, ముఖ్యమంత్రికైనా ఒక్కటే. రేవంత్ రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేయాలన్నారు. ఒక పక్క కరువు వస్తుంటే.. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వండయ్యా అని అడిగితే మీ పీకలు నొక్కుతా అంటున్నాడు. రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ లేకుండానే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని సలహా ఇస్తే వాళ్లను జైల్లో పెడతా అంటున్నాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని. రిపేర్లు చేస్తామని సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేయించారు. తీరా వానాకాలం వచ్చినా 30 పైసల పని కూడా జరగలేదు. ఉన్న నీళ్లు వృధాగా పోయాయి, ఇప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేశారన్నారు.
అందాల పోటీలకు వందల కోట్లు ఎక్కడివి..
ఎన్నికల ముందు ప్రతి గింజా కొంటాం, అన్నింటికీ బోనస్ ఇస్తాం అని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడేమో కేంద్రం ఏది కొనుమంటే అదే కొంటాం, ఎంత కొనుమంటే అంతే కొంటాం అంటూ చేతులెత్తేశారని హరీశ్ రావు పేర్కొన్నారు. 20% ప్రభుత్వం కొంటే, మిగతా 80% రైతులు అడ్డికి పావుశేరు చొప్పున బయట అమ్ముకుని నష్టపోవాలా.. ఢిల్లీ చెప్పినట్లే వినడానికి ఆ ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకు..? కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే.. ఇప్పుడు అది 8 గంటలకు పడిపోయింది.
రుణమాఫీ పేరుతో దేవుళ్ల మీద ఒట్లు వేసి, తీరా గెలిచాక దేవుళ్లకే శఠగోపం పెట్టారు. కౌలు రైతులకు ఇస్తామన్న రైతుబంధు ఎగ్గొట్టారు. 30 నెలల్లో రైతులకు 19 వేల కోట్ల రూపాయల రైతుబంధు ఎగవేశారు. ఎల్ఐసీకి ప్రీమియం కట్టకుండా రైతుల బీమా ఆపేశారు. డబ్బులు లేవని చెప్పే రేవంత్ రెడ్డి.. తన మనవడి కోసం ఫుట్ బాల్ మ్యాచ్ పెట్టి వందల కోట్లు వృధా చేశాడు. ఇంట్లో పూరీలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ.. డబ్బులు లేవంటూనే మూసీ సుందరీకరణకు, ఫ్యూచర్ సిటీకి లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నాడు. అందాల పోటీలకు వందల కోట్లు ఎక్కడివని హరీశ్ రావు ప్రశ్నించారు.
బడులు తెరిచి నెల రోజులవుతున్నా పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్ రాలేదు. సీఎం కమీషన్ల కక్కుర్తికి ప్రభుత్వ, గురుకుల పాఠశాలల పిల్లలు అవస్థలు పడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు . 20 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల ఫీజు రీయింబర్స్ మెంట్ బంద్ పెట్టి వారి బతుకులను ఆగం చేస్తున్నాడని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. .
కేసీఆర్ పథకాలన్నీ బంద్:
ఏ స్కీం ఆగలేదు అంటున్న రేవంత్ రెడ్డి.. గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, కేసీఆర్ కిట్, రైతుబీమా అన్నీ బంద్ పెట్టాడు. కేసీఆర్ మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తే.. నేడు నారాయణఖేడ్ లో మూడు రోజులకు ఒక్కసారి నల్లా వస్తోంది. నారాయణఖేడ్, ఆందోల్ ప్రజల సాగునీటి కోసం కేసీఆర్ గారు ‘సంగమేశ్వర – బసవేశ్వర’ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తే, రేవంత్ రెడ్డి ఆ పనులను బంద్ పెట్టించాడు. మూసీ ముద్దు – బసవేశ్వర వద్దా రేవంత్ రెడ్డి. ఈ జిల్లా మంత్రి ఏం చేస్తున్నట్టు..? ఇక్కడి ఎమ్మెల్యే ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు.
10కి 10 ఎమ్మెల్యే స్థానాలు బీఆర్ఎస్వే..
బసవేశ్వరుని స్ఫూర్తితో త్వరలోనే భారీ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నామన్నారు హరీశ్ రావు.నారాయణఖేడ్ లోని బసవేశ్వర విగ్రహం నుండి సంగమేశ్వర ప్రాజెక్టు వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. 117 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే శంకరగిరి మాన్యాలు పట్టినట్టే.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 9 సీట్లు కూడా గెలవదు. ఈ సారి మెదక్ జిల్లాలో 10కి 10 ఎమ్మెల్యే స్థానాలు బీఆర్ఎస్వేనని స్పష్టం చేశారు.
నన్ను కోసినా పైసలు లేవు అంటున్నావు.. కానీ లక్ష కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తున్నావు, లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ కడుతున్నావు
నువ్వు మానవవాడితో పూరీలు చేసుకుంటే ప్రాబ్లెమ్ లేదు.. నీ ఫుట్బాల్ సోకుల కోసం వందల కోట్లు ఖర్చు పెడితే ప్రాబ్లెమ్
ఆ పైసల తోని 4 స్కూళ్లు, 4 కాలేజీలు… pic.twitter.com/vav3oAepIS
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2026
సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు కోసం బసవేశ్వర నుండి సంగమేశ్వర వరకు త్వరలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తా
– హరీష్ రావు pic.twitter.com/gN2BvqhTHm
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2026