Road accident : తమిళనాడు (Tamil Nadu) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున మదురై జిల్లా (Madurai district) లోని కొట్టంపట్టి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను దాటింది. అదే సమయంలో తిరుచిరాపల్లి (Thiruchirapally) వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఎదురుగా రావడంతో దానిని ఢీకొట్టి పక్కనే ఉన్న ప్రయాణికుల షెడ్డులోకి దూసుకెళ్లింది.
ప్రైవేటు బస్సు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రభుత్వ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులతో సహా బస్టాప్‌లో నిద్రిస్తున్న మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు చెన్నై నుంచి మార్తాండం వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమించడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.