Deewana | థియేటర్లలో మంచి ఆదరణ పొందిన చిత్రం దీవానా. యువ నటులు హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేగలై ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘దీవానా’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఇటీవల స్ట్రీమింగ్కు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంటూ అరుదైన రికార్డును నమోదు చేసింది.ఆహాలో విడుదలైనప్పటి నుంచి ‘దీవానా’ ఏకంగా 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు పూర్తి చేసి మరో మైలురాయిని అందుకుంది. థియేటర్లలో పాజిటివ్ టాక్తో ఆకట్టుకున్న ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల మన్ననలు కూడా పొందుతుండటం విశేషం. మంచి కథ, భావోద్వేగాలు, వినోదం కలగలిసిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేగలై జంటగా నటించగా, ప్రముఖ నటులు నరేష్ విజయ్ కృష్ణ, ఝాన్సీ, బలగం వేణు, జీవన్ కుమార్, టోనీ కీలక పాత్రల్లో కనిపించి కథకు బలాన్నిచ్చారు. వీరి నటన కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘దీవానా’ చిత్రాన్ని వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మించారు. గీతా ఆర్ట్స్, వి స్టూడియోస్, అర్హా మీడియా బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు ఈశ్వర్ చంద్ర సంగీతాన్ని అందించారు. ఆయన స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి.
థియేటర్ల తర్వాత ఓటీటీలో కూడా ఇలాంటి అద్భుతమైన స్పందన రావడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. రానున్న రోజుల్లో ‘దీవానా’ మరిన్ని స్ట్రీమింగ్ రికార్డులు సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.మరి మీరు ఈ సినిమాని మీరు ఇప్పటివరకు చూడకపోతే ఓ లుక్కేయండి మరి.