Bakki Venkataiah| జహీరాబాద్, జనవరి 6 : ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడుల విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో ఇటీవల బ్యాగరి రాములు ఇంటి కూల్చివేత ఘటనపై గత నెలలో బాధిత కుటుంబాన్ని కలిసి సంఘటనపై సమగ్ర విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం సజ్జాపూర్ గ్రామానికి విచ్చేసిన కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య, కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ బాధితుడు బ్యాగరి రాములుకు రూ.25,000 పరిహార చెక్కును అందజేశారు.
అనంతరం ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ బక్కి వెంకయ్య మాట్లాడుతూ.. బాధితుడికి పరిహారం అందజేయడానికే తాను వచ్చానని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలపై దాడుల విషయంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, బాధితులకు అండగా నిలవకుండా దాడి చేసిన వారి వైపు నిలవడం సరికాదని వ్యాఖ్యా నించారు. గ్రామాల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని చెడగొట్టే చర్యలను సహించబోమని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బాధితుడికి పూర్తి న్యాయం జరిగే వరకు అండగా ఎస్సీ, ఎస్టీ కమిషన్..
బాధితుడికి పూర్తి న్యాయం జరిగే వరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా నిలుస్తుందని బక్కి వెంకయ్య
స్పష్టం చేశారు. అనంతరం జహీరాబాద్ పట్టణ సమీపం రంజోల్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యా బోధనలు, తదితర సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన విద్యతోపాటు మంచి భోజనాన్ని విద్యార్థులకు అందించాలన్నారు.
అనంతరం విద్యార్థులు కలిసి భోజనాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు, ఆర్డీవో దేవుజా, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అఖిలేష్ రెడ్డి, ఎంపీడీవో, తహసిల్దార్ సుప్రియ, పోలీస్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


NBK 111 | బాలయ్య సినిమా నుండి స్టార్ హీరోయిన్ ఔట్.. అదే కారణమా?