Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నివాసంలో తాజాగా ఓ ప్రత్యేకమైన బిర్యానీ పార్టీ జరిగింది. ఈ వేడుకలో రామ్ చరణ్‌తో పాటు ఆయన భార్య ఉపాసన, తల్లి సురేఖ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ బిర్యానీ పార్టీలో అసలు విశేషం ఏంటంటే… బిర్యానీ వండింది ఎవరో కాదు, జపాన్ రాజధాని టోక్యోకు చెందిన ప్రముఖ చెఫ్ తకమాసా ఒసావా అలియాస్ ‘బిర్యానీ ఒసావా’.
ప్రపంచ వ్యాప్తంగా బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తకమాసా ఒసావా సోమవారం (జనవరి 05) హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసానికి ప్రత్యేకంగా వచ్చారు. సంప్రదాయ భారతీయ పద్ధతిలో ఆరుబయట కట్టెల పొయ్యిపై ఘుమఘుమలాడే దేశీ బిర్యానీని సిద్ధం చేశారు. ముఖ్యంగా గర్భిణిగా ఉన్న ఉపాసన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వండినట్లు తెలుస్తోంది. చెఫ్ ఒసావా వండిన బిర్యానీ రుచి అద్భుతంగా ఉందని, అందరూ ఎంతో ఆస్వాదించినట్లు సమాచారం. బిర్యానీ సిద్ధమైన అనంతరం చెఫ్ ఒసావానే స్వయంగా రామ్ చరణ్, ఉపాసన, సురేఖలకు వడ్డించడం మరో విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఒసావా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకోగా, అభిమానులు వాటిపై లైక్స్, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
అటు రామ్ చరణ్ కూడా తన ఇంట్లో జరిగిన ఈ ప్రత్యేక బిర్యానీ పార్టీ ఫోటోలను షేర్ చేయడంతో అవి మరింతగా వైరల్ అయ్యాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉంటూనే, మరోవైపు ఇలాంటి స్పెషల్ మూమెంట్స్‌తో అభిమానులకు దగ్గరవుతూ రామ్ చరణ్ మరోసారి వార్తల్లో నిలిచారు.