కావలసిన పదార్థాలు
పుచ్చకాయ ముక్కలు: ఎరుపు రంగు భాగం తీసేసినవి అయిదారు
పచ్చిమిరపకాయలు: నాలుగు
ఆవాలు: టీ స్పూన్
మినప్పప్పు, పచ్చి శనగపప్పు, జీలకర్ర: అర టీ స్పూన్ చొప్పున
నూనె: టేబుల్ స్పూన్
పసుపు : పావు స్పూను
ఆవపిండి: ఒక టీ స్పూన్
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
ముందుగా పుచ్చకాయను ముక్కలుగా తరిగి ఎరుపు రంగు తీసేయాలి, ఆ తర్వాత పైన ఉండే ఆకుపచ్చ రంగు భాగాన్ని కూడా చాకుతో తీసేసి తెలుపు రంగులో ఉండే ముక్కల్ని బాగా తురుముకోవాలి. గ్రేటర్లో పెద్ద రంధ్రాలు ఉండే భాగాన్ని అందుకోసం ఎంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసి, అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు కూడా జోడించి బాగా వేగనివ్వాలి. తర్వాత ఈ పుచ్చకాయ తురుమును వేసి తగినంత ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. అందులో నీరు అంతా పోయేదాకా వేగనివ్వాలి. చిన్న గిన్నెలో ఆవపిండిని నీళ్లతో జారుడుగా కలిపి కూర పూర్తయ్యే ముందు వేసి బాగా కలుపుకోవాలి. ఆవ రుచి ఇష్టం లేని వాళ్లు దీన్ని వదిలేయవచ్చు. చివర్లో కొత్తిమీర వేసి దించుకుంటే పుచ్చకాయ చెక్కు కూర సిద్ధమైనట్టే!
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు