White Foods | రోజూ వంటగదిలో ఉపయోగించే కొన్ని తెల్లని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి నెమ్మదిగా హానికరంగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక జీవనశైలిలో ఎక్కువగా ప్రాసెస్ చేసిన పదార్థాలు వాడడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, జీర్ణకోశ సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి వంటగది నుండి తప్పనిసరిగా ఈ వైట్ ఫుడ్స్ ను తొలగించాలని సూచించారు. మనం తీసుకునే ఆహారం నుండి తొలగించాల్సిన 5 వైట్ ఫుడ్స్ గురించి.. అలాగే వాటికి బదులుగా తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల గురించి నిపుణులు వివరిస్తున్నారు.
వైట్ షుగర్‌కు గుడ్‌బై చెప్పాలి. తెల్ల చక్కెర దాదాపు ప్రతి ఇంట్లో ఉండే సాధారణ పదార్థం. అయితే ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ఒక్కసారిగా పెంచి, అలవాటు అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు)ను పెంచి గట్ హెల్త్‌ను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కనుక దీనికి బదులుగా బెల్లం, తేనె, ఖర్జూరం, కొబ్బరి చక్కెర వంటి సహజ స్వీటెనర్లను ఉపయోగించడం మంచిది. అలాగే మైదా కూడా ఆరోగ్యానికి ముప్పును కలిగిస్తుంది. మైదా లేదా వైట్ ఫ్లోర్లో ఫైబర్, ముఖ్యమైన పోషకాలు చాలా వరకు తొలగించబడతాయి. ఇది శరీరంలో చక్కెరలాగే ప్రవర్తించి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది. మైదాకు బదులుగా గోధుమ పిండి, మిల్లెట్స్ (సిరిధాన్యాలు), ఓట్స్ పిండి, బాదం పిండి, శనగపిండి (బేసన్) వంటివి ఉపయోగిస్తే జీర్ణక్రియ మెరుగుపడి ఎక్కువసేపు తృప్తిగా ఉండే అవకాశం ఉంటుంది.
రిఫైన్డ్ ఉప్పు వాడకాన్ని కూడా తగ్గించాలి. సాధారణ టేబుల్ సాల్ట్‌లో సహజ ఖనిజాలు తొలగించబడతాయి. అలాగే ఇందులో కొన్ని రసాయనాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. తెల్ల ఉప్పుకు దీనికి బదులుగా రాక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్, సహజంగా ఎండబెట్టిన సముద్ర ఉప్పు వంటి వాటిని వాడడం మంచిది. అంతేకాకుండా రిఫైన్డ్ ఆయిల్స్‌ను వాడడం కూడా ప్రమాదకరం. మార్కెట్లో లభించే అనేక రిఫైన్డ్ నూనెలు అధిక ప్రాసెసింగ్ ద్వారా తయారవుతాయి. వీటిలో ఉపయోగించే రసాయనాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను పెంచే అవకాశం ఉంటుంది. అందువల్ల కోల్డ్-ప్రెస్డ్ ఆయిల్స్, నెయ్యి, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను వాడాలి.
పాలిష్ చేసిన తెల్ల బియ్యాన్ని ఉపయోగించడం కూడా అంత మంచిది కాదు. తెల్ల బియ్యాన్ని ఎక్కువగా ప్రాసెస్ చేయడం వల్ల పోషక విలువలు తగ్గిపోతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. దీనికి బదులుగా బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, మిల్లెట్స్ వంటి ధాన్యాలను తీసుకుంటే ఎక్కువ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఈ విధంగా వంటింట్లో ఉండే ఈ 5 రకాల వైట్ ఫుడ్స్ ను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం ఎంత తెల్లగా ఉంటే, అందులోని పోషకాలు అంతగా తొలగించబడే అవకాశం ఉంటుంది. వంటగదిలో చిన్న మార్పులు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి బాటలు వేసుకోవచ్చు. సరైన ఆహార ఎంపికలు శరీరానికి శక్తినివ్వడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.