చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన టీవీకే చీఫ్ విజయ్, ఒక చిన్న పొరపాటు చేసినట్లు తెలుస్తున్నది. అందుకే సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారానికి ఆలస్యం జరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. (small error delayed Vijay’s CM Oath) 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి తగిన మెజారిటీ లభించలేదు. 108 స్థానాల్లో విజయంతో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అది పెద్ద పార్టీగా నిలిచింది. డీఎంకే 59, అన్నాడీఎంకే 47, కాంగ్రెస్ 5, పీఎంకే 4, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంల్ 2 చొప్పున, బీజేపీ, డీఎండీకే, ఏఎంఎంకేఎంఎన్కేజెడ్ ఒక్కో సీటు చొప్పున గెలుచుకున్నాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్కు అయిన 118 సీట్లు ఏ పార్టీకి దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో హంగ్ పరిస్థితి ఏర్పడింది.
కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో టీవీకే చీఫ్ విజయ్ చిన్న పొరపాటు చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తొలుత కేవలం ఎన్నికైన 108 మంది టీవీకే ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను గవర్నర్కు ఆయన సమర్పించి ఉండాల్సింది. తద్వారా ఎన్నికల్లో అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించిన టీవీకే అధినేతగా తన బలాన్ని ఆయన చాటి చెప్పి ఉంటే ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించి ఉండేవారని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే ఇలా చేయని విజయ్ తగిన మెజారిటీ కోసం ముందుగానే ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్తో పాటు చిన్న పార్టీల మద్దతును ఆయన కోరారు. ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ తొలుత మద్దతు ప్రకటించింది. దీంతో మే 6న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు విజయ్ సమర్పించిన లేఖలో టీవీకే ఎమ్మెల్యే సంతకాలతో పాటు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను కూడా చేర్చారు. ఈ నేపథ్యంలో 112 మంది సభ్యులతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ ప్రయత్నిస్తున్నట్లుగా గవర్నర్ భావించినట్లు తెలుస్తున్నది. అందుకే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సంఖ్య అయిన 118 సంతకాలతో తిరిగి రావాలని ఆయనను కోరినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఒకవేళ విజయ్ అతిపెద్ద ఏకైక పార్టీగా పేర్కొంటూ లేఖను సమర్పించి ఉంటే గవర్నర్ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి ఉండేవారని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. ఈ పొరపాటు వల్లనే విజయ్ సీఎం ప్రమాణ స్వీకారం ఆలస్యమైనట్లు పొలిటికల్ వర్గాలు విశ్లేషించాయి. నటన నుంచి రాకీయాల్లోకి వచ్చిన ఆయనకు ఈ దిశగా తగిన మార్గ నిర్దేశం లోపించినట్లు పేర్కొన్నాయి.
Also Read:
TVK secures magic number | టీవీకేకు వీసీకే, వామపక్షాల మద్దతు.. మ్యాజిక్ నంబర్ 118 సాధించిన విజయ్
Vijay’s Cabinet | విజయ్ ప్రభుత్వంలో.. కాంగ్రెస్, వామపక్షాలకు 2, వీసీకేకు ఒక మంత్రి పదవి!
VCK slams TVK | వాట్సాప్ ద్వారా మద్దతు కోరిన టీవీకే.. అహంకారమని వీసీకే విమర్శ