చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం చిన్న పార్టీల మద్దతు కోరింది. అయితే వాట్సాప్ ద్వారా మద్దతు కోరడాన్ని వీకేసీ తప్పుపట్టింది. టీవీకే వైఖరి అహంకారమని విమర్శించింది. (VCK slams TVK) వీసీకే ప్రధాన కార్యదర్శి సింథనై సెల్వన్ శుక్రవారం ఎక్స్‌లో ఈ మేరకు ఒక పోస్ట్ చేశారు. ‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజారిటీ సాధించని పరిస్థితుల్లో, విజయ్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది. ఆయన మద్దతు కోరుతున్న పార్టీల నాయకులను వెంటనే ముఖాముఖిగా కలవాల్సింది కాదా?’ అని ప్రశ్నించారు.
కాగా, టీవీకేలోని ద్వితీయ శ్రేణి నాయకులు విజయ్ను తప్పుదారి పట్టిస్తున్నారని సింథనై సెల్వన్ ఆరోపించారు. వారి ప్రభావానికి ఆయన లోనుకాకూడదని సూచించారు. ‘గవర్నర్ ద్వారా తమిళనాడులోకి ప్రవేశించకుండా బీజేపీని నిరోధించాల్సిన ప్రాముఖ్యత గురించి ఆయన (విజయ్) బహిరంగంగా చర్చించి ఉండాల్సింది కాదా? ఒక వాట్సాప్ సందేశం ద్వారా మద్దతు కోరి, కేవలం తిరిగి సమాధానం ఇవ్వమని అడగడాన్ని మేమెలా అర్థం చేసుకోవాలి?’ అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకేలోని కొన్ని వర్గాలు అహంకారం ప్రదర్శిస్తున్నాయని వీసీకే ప్రధాన కార్యదర్శి ఆరోపించారు. అలాగే కూటమి నిర్మాణానికి అవసరమైన రాజీ ధోరణిని అవలంబించకుండా డీఎంకేపై దాడి చేస్తూ, ప్రతీకార ధోరణిలో మాట్లాడటాన్ని కూడా ఆయన విమర్శించారు. ‘డీఎంకేను రాచరిక రాజకీయాలు అని పిలుస్తూ, ఆ తర్వాత ఏమాత్రం సంకోచం లేకుండా దాని మిత్రపక్షాల మద్దతు కోరడంలో తర్కం ఏమిటి?’ అని సింథనై సెల్వన్ ప్రశ్నించారు. వీసీకే నేతలు ఆ పార్టీలో ‘స్లీపర్ సెల్స్’గా వ్యవహరిస్తున్నారని టీవీకే నేతలు చేసిన వ్యాఖ్యలను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు.
అలాగే ఎన్నికల తర్వాత తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలించాలన్న టీవీకే నిర్ణయాన్ని సింథనై సెల్వన్ తప్పుపట్టారు. తమిళనాడులో ‘రిసార్ట్ రాజకీయాలను’ టీవీకే తిరిగి ప్రవేశపెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో పెద్ద రాజ్యాంగ సంక్షోభం తలెత్తవచ్చని ఆయన హెచ్చరించారు. తమిళనాడులో గవర్నర్ పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సెల్వన్ ఆరోపించారు. ప్రజాస్వామ్య నియమాలను అతిక్రమించే ఏ చర్య పట్ల అయినా తమిళనాడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.