NBK 111 | తెలుగు సినీ పరిశ్రమలో ఎనర్జీకి, మాస్ ఇమేజ్‌కు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నటుడు నందమూరి బాలకృష్ణ. కెరీర్ నాలుగు దశాబ్దాలు దాటినా ఆయన జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవలి కాలంలో బాలయ్య చేస్తున్న సినిమాలు చూస్తే, ఆయన అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహరాజ్’ , అఖండ 2 వంటి చిత్రాలతో యాక్షన్‌తో పాటు భావోద్వేగాలను సమర్థంగా ప్రేక్షకులకు చేరువ చేశారు. అఖండ తొలి భాగం సాధించిన ఘన విజయం నేపథ్యంలో అఖండ 2 చిత్రం చేసిన బాలయ్య రీసెంట్గా ఈ చిత్రంతో ప్రేక్షకులని పలకరించారు. ఈ మూవీ ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రం చేస్తుండగా, ఈ చిత్రాన్ని NBK111గా పిలుస్తున్నారు.
ఇంతకుముందు ఈ కాంబినేషన్లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అదే జోరును మరింత భారీ స్థాయిలో కొనసాగించాలనే ఉద్దేశంతో ఈసారి మరింత బలమైన కథతో ముందుకు వస్తున్నారని చిత్ర బృందం చెబుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇది చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటుందని సమాచారం. బాలకృష్ణ ఇందులో రెండు విభిన్న కాలాల్లో కనిపించే పాత్రలు చేయనున్నారని, అందులో ఒకటి రాజుగా ఉండే పవర్ఫుల్ క్యారెక్టర్ అని టాక్ వినిపిస్తోంది. ఈ అంశమే అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.
హీరోయిన్ ఎంపిక కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో, ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించబోతుండడం వార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. గత ఏడాది నవంబర్ 26న నయనతారను హీరోయిన్గా అధికారికంగా పరిచయం చేస్తూ మేకర్స్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ భామ తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ దశలో భారీ బడ్జెట్ అవుతుండడం, నయన్‌కి దాదాపు 8 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉండడం, మేకర్స్‌ని ఆలోచనలో పడేసిందట. వేరే హీరోయిన్ అయితే రెండు కోట్లతో అయిపోతుందని అనుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.