ఇల్లూ.. పిల్లలు.. ఉద్యోగం.. చూస్తూనే అన్ని బాధ్యతలు దించేసుకుంన్నాం అనుకునేలోపే.. ముదిమి పలకరిస్తుంది. అప్పటికే పిల్లలెక్కడో.. ఉంటారు! మనుషులు, మనసుల మధ్య దూరం పెరుగుతుంది.. కొందరికి తోడూ కరువవుతుంది. ఇంట్లోనే ఉన్నా కూడా ఏదో తెలియని ఒంటరితనం, మానసిక ఒత్తిడి వృద్ధులను కలవరపెడుతుంటాయి. కానీ, మీకు తెలుసా? ఇప్పుడు ఆ నాలుగు గోడల మధ్యే ఉంటూనే.. వారు తమకు నచ్చిన ప్రపంచంలోకి విహరించే అద్భుత అవకాశం ‘వర్చువల్ రియాలిటీ’ ద్వారా అందుబాటులోకి వచ్చింది. అల్జీమర్స్ నుంచి డిప్రెషన్ వరకు.. వయసు మళ్లిన వారు ఎదుర్కొనే ఎన్నో క్లిష్టమైన సమస్యలకు వీఆర్ హెడ్సెట్లు ఇప్పుడు ఓ ‘డిజిటల్ మందు’లా మారుతున్నాయి. మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నది ఈ వినూత్న రీహ్యాబ్ టెక్నాలజీ.
ఈ విజువల్ థెరపీ మెదడులోని డోపమైన్, సెరోటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లను విడుదల చేయడమే కాకుండా, రక్తపోటును నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా
డిమెన్షియా (మతిమరుపు) ఉన్న రోగులకు ఇది ఓ వరప్రసాదంలా మారింది. తమ పాత ఇంటిని లేదా చిన్నప్పుడు ఆడుకున్న పార్కును
మళ్లీ కళ్లముందు చూస్తుంటే కలిగే ఆనందం మందులకంటే గొప్పగా పనిచేస్తుంది. కేవలం వినోదం కోసమే కాకుండా, ఫిజికల్ థెరపీలో కూడా ఈ వీఆర్ గ్లాసెస్ వాడుతున్నారు. దీనివల్ల వృద్ధులు వ్యాయామం చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
దేని స్పెషాలిటీ దానిదే
AR (ఆగ్మెంటెడ్ రియాలిటీ): మనం ఉన్న చోటే
అదనపు సమాచారాన్ని డిజిటల్ రూపంలో చూపిస్తుంది. ఉదాహరణకు ‘పోకీమాన్ గో’ గేమ్. మీ ఫోన్ కెమెరా ఓపెన్ చేస్తే.. మీ గదిలోనే కార్టూన్ బొమ్మలు
కనిపిస్తాయి. అంటే వాస్తవ ప్రపంచం పైనే డిజిటల్ లేయర్ అన్నమాట.
VR (వర్చువల్ రియాలిటీ): ఇది మిమ్మల్ని పూర్తిగా మరో
లోకానికి తీసుకెళ్తుంది. కళ్లకు వీఆర్ హెడ్సెట్
పెట్టుకుంటే.. మీరు మీ ఇంట్లో ఉన్నారనే సంగతే మర్చిపోతారు. మీరు చంద్రుడి మీద
ఉన్నట్టుగా లేదా సముద్రం అడుగున
ఉన్నట్టుగా ఫీల్ అవుతారు.
MR (మిక్స్డ్ రియాలిటీ): ఈ అడ్వాన్స్డ్ టెక్సాలజీతో డిజిటల్ వస్తువులు మన నిజ ప్రపంచంతో కలిసిపోతాయి. మీ గదిలో ఒక వర్చువల్ టేబుల్ని పెడితే.. మీరు దాన్ని చేత్తో పట్టుకోవచ్చు,
జరపవచ్చు. డిజిటల్ వస్తువులు కూడా ప్రాణం ఉన్నట్టుగా రియాక్ట్ అవుతాయి.
అద్భుతమైన మెడికల్ టూల్!
వీఆర్ రీహ్యాబ్ కేవలం మానసిక ఉల్లాసానికే పరిమితం కాదు.
దీని వెనుక బలమైన సైన్స్ ఉంది.
రెమినిసెన్స్ థెరపీ: గతాన్ని గుర్తుచేసుకోవడం ద్వారా వృద్ధులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీఆర్లో పాత కాలం నాటి వీధులు, కోరుకున్న ప్రదేశాలు చూపిస్తూ వారి జ్ఞాపకశక్తిని ప్రేరేపిస్తారు.
ఫిజికల్ రీహాబిలిటేషన్: పక్షవాతం లేదా కీళ్ల నొప్పులతో బాధపడే వారు వీఆర్ గేమ్స్ ఆడుతూ తెలియకుండానే తమ కాళ్లు, చేతులు కదిలిస్తారు. ఇది ఫిజియోథెరపీ కంటే వేగంగా ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పెయిన్ మేనేజ్మెంట్: తీవ్రమైన నొప్పులతో బాధపడే వృద్ధులకు వీఆర్ ద్వారా ‘డిస్ట్రాక్షన్ థెరపీ’ చేస్తారు. అంటే వారి దృష్టిని ఒక అందమైన లోకం వైపు మళ్లించడం ద్వారా మెదడు ఉత్తేజితం అవుతుంది. నొప్పి సంకేతాలను స్వీకరించడం తగ్గిస్తుంది.
ఏమోషనల్ సపోర్ట్: ముదిమి వయసులో కావాల్సింది జాలి కాదు.. తోడు. టెక్నాలజీ వారి శరీరానికి అదనపు శక్తిని ఇవ్వలేకపోవచ్చు కానీ, వారి మనసుకు మాత్రం అనంతమైన ఉత్సాహాన్ని, ప్రశాంతతను అందించగలదు.