Raja Shivaji | మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న తాజా చిత్రం ‘రాజా శివాజీ’ (Raja Shivaji). బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేష్ దేశ్‌ముఖ్ స్వయంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషిస్తూ, ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తుండగా.. రితేష్ భార్య, ప్రముఖ నటి జెనీలియా దేశ్‌ముఖ్ (ముంబై ఫిల్మ్ కంపెనీ), జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 2026 మే 1న (మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. మరాఠీ, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
మరాఠా ప్రజల స్వరాజ్యం కోసం శివాజీ మహారాజ్ చేసిన పోరాటాన్ని, నాటి ఉద్రిక్త పరిస్థితులను టీజర్లో చాలా అద్భుతంగా చూపించారు. ఇక సంజయ్ దత్ వాయిస్‌తో వచ్చే ‘మరాఠాల తలరాతలో చావు రాసి ఉందా.. లేదా బానిసత్వమా?’ అంటూ సాగే డైలాగ్‌కు.. రితేష్ దేశ్‌ముఖ్ ‘స్వరాజ్యం’ అంటూ సమాధానమిచ్చే సీన్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ విజువల్స్ ఈ సినిమాకు అందిస్తుండగా, అజయ్-అతుల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు.