Band Melam | యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన బ్యాండ్ మేళం మార్చిలో భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో, ‘కోర్టు’ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రానికి కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించారు. సినిమాలోని ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సన్నివేశాలు, హీరో డ్యాన్స్‌లు యువతను ఆకట్టుకున్నప్పటికీ, సెకండ్ హాఫ్ సాగదీసినట్టుగా ఉందన్న విమర్శలు వచ్చాయి. అవుట్‌డేటెడ్ స్క్రీన్‌ప్లే, కథలో బలం లేకపోవడం వల్ల ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదనిపించినా, మొత్తం మీద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.
ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం, అలాగే కోన వెంకట్ నిర్మాణ విలువలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.సినిమా ఫలితం ఎలా ఉన్నా, కొన్ని వెబ్సైట్ల రివ్యూలపై దర్శకుడు సతీష్ జవ్వాజి తీవ్రంగా స్పందించారు. రీసెంట్గా జరిగిన సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. సినిమా బాగుందా లేదా అనేది చెప్పే హక్కు అందరికీ ఉంది. కానీ విమర్శ పేరుతో కించపరచడం సరైంది కాదు. గౌరవం లేకుండా రాసే రివ్యూల వల్ల మేకర్స్ పడే కష్టం మొత్తం వృథా అవుతోంది. మా లాంటి కొత్త దర్శకులకు ఇవి మరణ శాసనాల్లా మారుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
రివ్యూలు రాసే వారు సినిమా వెనుక ఉన్న వందలాది కుటుంబాల కష్టాన్ని గుర్తించాలని, నిర్మాణాత్మక విమర్శలను తాము స్వీకరిస్తామని ఆయన చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేయడం మాత్రం సరైంది కాదని స్పష్టం చేశారు. ప్రేక్షకులు రివ్యూలను మాత్రమే నమ్మకుండా, థియేటర్లకు వచ్చి స్వయంగా సినిమా చూసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణలోని ఇబ్రహీంపట్నంకు చెందిన సతీష్ జవ్వాజి, సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో ఎన్నో ఏళ్ల కృషి తర్వాత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ‘బ్యాండ్ మేళం’తో తన మొదటి ప్రయత్నంలోనే గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించిన ఆయనకు పరిశ్రమ వర్గాల నుంచి ప్రోత్సాహం లభిస్తోంది.