– అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్‌రావు
రామగిరి, జూలై 30 : తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణ పరిషత్ నుంచి రుణాల (లోన్స్) కోసం నిరీక్షిస్తున్న పేద బ్రాహ్మణులకు తక్షణమే రుణాలు మంజూరుయ్యేలా చర్యలు తీసుకోవాలని అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ జిల్లా వాసి బొల్లా వేణుగోపాల్‌రావు కోరారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు బసవరాజు శ్రీనివాస్ నియమకమై బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం ఆయనను హైదరాబాద్‌లోని కార్యాలయంలో సంఘం నాయకులతో మర్యాద పూర్వంగా కలిసి శాలువాతో సత్కరించారు.
విదేశీ విద్య కోసం వెళ్లిన బ్రాహ్మణ విద్యార్థులకు రావాల్సిన రుణాలు సకాలంలో అందక బ్యాంకులు విధిస్తున్న అధిక వడ్డీలకు భరించలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు బ్రాహ్మణులకు వర్తింపజేస్తూ అదుకోవాలని, పలు అంశాలతో వినతి పత్రం అందచేశారు. దీనిలో భాగంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమం, విదేశీ విద్య, స్వయం ఉపాధి రుణాల మంజూరే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. బ్రాహ్మణులకు భరోసా కల్పించేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగరాజు శ్రీనివాసరావు, కొప్పోలు నవీన్ శర్మ, కొలనుపాక అనంతపద్మనాభ శర్మ పాల్గొన్నారు.