లక్నో: ఇంటి వద్ద దింపుతానని ఒక బాలికను పోలీస్ కానిస్టేబుల్ నమ్మించాడు. బైక్‌పై ఎక్కించుకుని శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లాడు. ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత హత్య చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ పోలీస్ కానిస్టేబుల్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. (Cop Rapes And Kills Girl) ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 28న పదేళ్ల బాలిక, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన అక్కకు ఆహారం అందించేందుకు అక్కడకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చింది.
కాగా, డయల్-112 విభాగంలో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అయిన 35 ఏళ్ల అభిషేక్ యాదవ్ ఆ బాలికను చూశాడు. పోలీస్ డ్రెస్‌లో ఉన్న అతడు ఆమెను ఇంటి వద్ద దింపుతానని నమ్మించాడు. తన బైక్‌పై ఎక్కించుకున్నాడు. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక శ్మశానవాటికకు ఆ బాలికను తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఆమెను హత్య చేశాడు. బాలిక మృతదేహాన్ని నదిలో పడేశాడు.
మరోవైపు బాలిక మిస్సింగ్‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఆసుపత్రితో పాటు పలు ప్రాంతాల్లోని సుమారు 200 సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. పోలీస్ కానిస్టేబుల్ అభిషేక్ యాదవ్ ఆ బాలికను బైక్‌పై తీసుకెళ్లడాన్ని అందులో గమనించారు. నిందితుడైన అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నించారు. అతడి సమాచారం ఆధారంగా గురువారం ఉదయం నదిలో గాలించి బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు.
అయితే అరెస్ట్ చేసిన పోలీస్ కానిస్టేబుల్ అభిషేక్‌ను గురువారం మధ్యాహ్నం వైద్యపరీక్షల కోసం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది అతడిపై దాడి చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వెంటనే అక్కడి నుంచి అతడ్ని తరలించారు.
కాగా, 2025లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళపై లైంగిక వేధింపు కేసులో అభిషేక్ యాదవ్ సస్పెండ్ కావడంతో పాటు జైలుకు వెళ్లాడని పోలీస్ అధికారి తెలిపారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత అతడు తిరిగి విధుల్లో చేరినట్లు చెప్పారు. బాలికపై హత్యాచారం కేసు నేపథ్యంలో ఆ పోలీస్ కానిస్టేబుల్‌ను సర్వీసు నుంచి తొలగించాలని సిఫార్సు చేసినట్లు వివరించారు. అలాగే జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కూడా అతడిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.