Roja Sekhar Master | టీవీ షోలలో తన ఎనర్జీ, టైమింగ్‌తో ఒకప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకున్న రోజా, రాజకీయాల్లో బిజీగా మారడంతో కొంతకాలం ఎంటర్టైన్మెంట్కు గ్యాప్ ఇచ్చింది. మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత స్క్రీన్‌పై అరుదుగా కనిపించిన రోజా, ఇటీవల మళ్లీ టీవీ షోలలో అప్పుడప్పుడు సందడి చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ – రోజా కాంబినేషన్ గతంలో స్కిట్స్, డ్యాన్సులతో సూపర్ హిట్ కావడంతో, వీరిద్దరూ కలిసి వస్తేనే ప్రత్యేకమైన హంగామా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. ఇప్పుడు చాన్నాళ్ల గ్యాప్ తర్వాత ఈ హిట్ జంట మళ్లీ ఒకే వేదికపై కనిపించబోతోంది. జీ తెలుగు ఛానల్ సంక్రాంతి సందర్భంగా రూపొందించిన స్పెషల్ ప్రోగ్రామ్‌లో శేఖర్ మాస్టర్ – రోజా కలిసి ఎంట్రీ ఇవ్వనున్నారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో వీరిద్దరూ సరదా ఛాలెంజ్‌లు విసురుకుంటూ, హాస్యభరితమైన మాటలతో నవ్వులు పూయించారు. అంతేకాదు, ఈ ప్రోగ్రామ్‌లో ఇద్దరూ కలిసి ఓ స్కిట్ కూడా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రోమో చూసినప్పటి నుంచే సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఈ సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్‌కు మరింత ఆకర్షణగా సుధీర్, ప్రదీప్ కూడా హాజరవుతున్నట్లు చూపించారు. వీరిద్దరిలో ఒక్కరు ఉంటేనే స్టేజ్ మీద సందడి ఉంటే, ఇద్దరూ కలిస్తే రచ్చే రచ్చ అన్నట్టుగా ఉంటుంది. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘ది రాజాసాబ్’ హీరోయిన్స్‌తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ప్రోమోలో చూపించడం ఆసక్తిని పెంచింది.
మొత్తంగా చూస్తే, శేఖర్ మాస్టర్ – రోజా రీ యూనియన్, సుధీర్ – ప్రదీప్ కామెడీ, సినిమా సెలబ్రిటీల సందడి అన్నీ కలిసి ఈ సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్‌ను పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మార్చబోతున్నాయనే అంచనాలు ఉన్నాయి. పండగ రోజున టీవీ ముందు కూర్చొని కుటుంబమంతా కలిసి చూసే కార్యక్రమంగా ఇది నిలుస్తుందని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.