హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు పూర్తి చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 3.60 లక్షల ఇం డ్లను మంజూరు చేయగా, ఇందులో లక్ష ఇండ్లకు ఈనెల 31లోగా గృహ ప్రవేశాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం త్వరలోనే గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలు అధికారికంగా తెలియజేస్తామని తెలిపారు.
శనివారం సచివాలయంలోని ప్రజాపాలన – ప్రగతి నివేదిక 99రోజుల కార్యాచరణపై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తికి దగ్గరగా ఉన్న ఇండ్లను సమర్థంగా సమన్వయం చేసుకొని జూన్ చివరినాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హౌసింగ్ బోర్డు పరిధిలోని 5వేల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ హౌసింగ్ బోర్డు రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు.