Ramayana | భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ (Ramayana)పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేచురల్ స్టార్ సాయిపల్లవి, కన్నడ స్టార్ యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించిన నేపథ్యంలో, చిత్రబృందం ఇప్పుడు ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్‌ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ ట్రైలర్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.
ఈ ప్రమోషనల్ కంటెంట్ కోసం ప్రముఖ హాలీవుడ్ స్టూడియో సోనీ పిక్చర్స్‌తో మేకర్స్ చేతులు కలపడం విశేషంగా మారింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో సినిమాకు మరింత విస్తృత ప్రచారం లభించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఇంగ్లీష్ ట్రైలర్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో నటీనటుల లిప్ మూవ్‌మెంట్స్‌ను ఇంగ్లీష్ డైలాగ్‌లకు అనుగుణంగా మార్చినట్లు తెలుస్తోంది. దీంతో డబ్బింగ్ చేసిన అనుభూతి కాకుండా, నేరుగా ఇంగ్లీష్‌లోనే నటించినట్లుగా ట్రైలర్ కనిపిస్తోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ సినిమాల్లో ఈ తరహా టెక్నాలజీని ఇంత పెద్ద స్థాయిలో వినియోగించడం విశేషంగా చెప్పుకోవచ్చు.
ఇంగ్లీష్ ట్రైలర్‌తో పాటు చిత్రబృందం సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న భారీ స్థాయిలో విడుదల కానుందని వెల్లడించింది. భారతదేశంతో పాటు పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ప్రమోషనల్ విజువల్స్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించాయి. ఇక ఈ చిత్రానికి హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలతో ప్రపంచ ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇంగ్లీష్ ట్రైలర్ విడుదలతో పాటు సోనీ పిక్చర్స్ భాగస్వామ్యం కూడా సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో మరింత హైప్‌ను తీసుకొచ్చింది.
An epic journey unlike anything seen before.
Watch the official trailer for #Ramayana, coming to theatres worldwide November 6. pic.twitter.com/BSiwVJMSs9
— Sony Pictures (@SonyPictures) August 5, 2026