Artisan Employees | జహీరాబాద్, ఏప్రిల్ 11 : తమ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ శాఖలో పనిచేస్తున్నఆర్టిజన్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం జహీరాబాద్ పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయ ఆర్టిజన్ కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ సంస్థలో ఆర్టీజన్లుగా పనిచేస్తున్నవారి విద్యార్హతలను బట్టి వారికి కన్వెర్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారికి ప్రత్యేక పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కన్వెర్షన్ ఇవ్వాలని , ఏపీఎస్ఈవీ రూల్స్ ఇవ్వాలని కోరారు.
గత ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులను ఆర్టిజన్లుగా విభజించారని, దీని వల్ల ఆర్టిజన్లు చాలా వరకు నష్టపోతున్నారన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం మాకు చెవిలో పువ్వు పెట్టిందని.. అందుకు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్ సంతోష్, రాజప్ప, సత్తేందర్, విష్ణు, మొగులప్ప, బక్కన్న తదితరులు పాల్గొన్నారు.