రాజన్న సిరిసిల్ల జిల్లా : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా బీఆర్ఎస్ నాయకులు ‘కేసీఆర్ కిట్ల’ను పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు శుక్రవారం గులాబీ నేతలు కేసీఆర్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి విభాగంలో కేసీఆర్ హయాంలో అందించిన కేసీఆర్ కిట్ నగదు సహాయం వివరాలున్న బోర్డు అందరి దృష్టిని ఆకర్షించింది.
నవజాత శిశువులను ఒడిలో పెట్టుకుని ఇంటికి వెళ్లే మహిళలు కేసీఆర్ కిట్ బోర్డును ఆసక్తిగా తిలకించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులే బాగుండే అని పాత జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకున్నారు.
‘మళ్లీ అలాంటి సంక్షేమ పథకాలు ఎప్పుడు వస్తాయో… పుట్టబోయే ప్రతి బిడ్డకు కేసీఆర్ కిట్ అందే రోజులు మళ్లీ రావాల’ని చేతిలో తమ కూతురు, కోడలకు పుట్టిన చంటిబిడ్డలను పట్టుకున్న పలువురు మహిళలు మాట్లాడుకున్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ నేతలు వారికి కేసీఆర్ కిట్లు అందించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.
