 
                                                            నర్సాపూర్: భారీ వర్షాలు కురుస్తూ వరి ధాన్యం నీటిపాలైతున్నా ప్రభుత్వం అధికారులకు మాత్రం చీమకుట్టినట్టు కూడా లేకుండా పోతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement Center) ప్రారంభించక, ధాన్యాన్ని కొనుగోలు చేయక రైతులను అధోగతి పట్టిస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి వారం రోజుల క్రితం వరిధాన్యం తీసుకువచ్చిన దానిని తూకం వేసి కొనే నాధుడే లేకుండా పోయాడు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసిపోగా, మళ్లీ సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, సిబ్బంది ఇప్పటికీ ప్రారంభించకపోవడం శోచనీయం.
ఈనెల 27న పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్ ప్రకటించినప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడం విచారకరం. వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు కోసిన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురావడం జరిగింది. కేంద్రానికి తీసుకువచ్చి వారం రోజులు గడుస్తున్న అధికారులు, సిబ్బంది కొనుగోలు చేయడమే కాదు కనీసం తూకాలను కూడా ఏర్పాటు చేయలేదు. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని కనీసం టార్పాలిన్లను పంపిణీ చేయడంలో కూడా విఫలమయ్యారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రైతులు తీసుకువచ్చిన వారి ధాన్యం పూర్తిగా నీటిపాలైంది. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

Paddy
వారం రోజులైనా వడ్లు కొంటలేరు..
పీఏసీఎస్ కేంద్రానికి వడ్లను తీసుకువచ్చి వారం రోజులు గడుస్తున్న తూకం వేయడం లేదని బేగంపేట్ నరేశ్ అనే రైతు చెప్పారు. కనీసం టార్పాయిళ్లను కూడా ఇవ్వడం లేదు. రెండు రోజుల క్రితం వరి ధాన్యం తడిసిపోయిందని, దానిని ఆరబెట్టగా సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మళ్లీ తడిసిందన్నారు. ఒక లారీ లోడ్ వరి ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చా, కాంటా పెట్టడానికి ఏ ఒక్కరు కూడా అందుబాటులో లేరు. తూకం వేయడానికి హమాలీలు ఇంకా రాలేదు, ఇప్పటికైనా కేంద్రాన్ని ప్రారంభించి వడ్లను కొనుగోలు చేయాలన్నారు.