సిద్దిపేట, అక్టోబర్ 27: సిద్దిపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మరో రూ. 141.34 కోట్లు మంజూరైనట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణం పరిశుభ్ర పట్టణంగా, దోమలు లేని పట్టణంగా, మురుగు కాల్వలు లేని పట్టణంగా తీర్చిదిద్దే క్రమంలో 2015 లో సిద్దిపేట వందేండ్ల పునాదిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.300 కోట్లతో పనులు ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు.
సిద్దిపేటలో పెరిగిన పట్టణ పరిధి, కొత్త కాలనీలు కలిసిన గ్రామాల దృష్ట్యా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు మరిన్ని నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల నిధి ద్వారా సిద్దిపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు మరో రూ. 141.34 కోట్లు మంజూరయ్యాయన్నారు. సిద్దిపేట పట్టణంలో ఏర్పాటైన కాలనీలు, విలీన గ్రామాలు, కొన్ని కాలనీల్లో మిగులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కొత్త కాలనీలు, విలీన గ్రామాల ప్రజలకు మురుగుకాల్వల సమస్య తీరనుందన్నారు. త్వరగా పను లు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.