టేక్మాల్, అక్టోబర్ 28: శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణయే కార్డన్ సెర్చ్ ఉద్దేశమని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని పల్వంచ గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్లి వాహనాలను, వాటికి సంబంధించిన పత్రాలను తనిఖీ చేశారు. గ్రామంలో అక్రమ వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అనే విషయాలను ఆరా తీశారు.
అనంతరం డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ప్రజల భద్రత మా మొదటి కర్తవ్యమని, కార్డన్ సెర్చ్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను గుర్తించి నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. డ్రగ్స్, మత్తు పదార్థాల సరఫరా వంటి నేరాలపై కట్టుదిట్టమైన నిఘా ఉందన్నారు.
ప్రజల్లో పోలీస్ పై విశ్వాసం పెంపొందించి, గ్రామాల్లో ప్రశాంత, భద్రతా వాతావరణం నెలకొల్పుతామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్సై రాజేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.