Double Bedroom House | హైదరాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని అధికారులకు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు పొంది వాటిలో నివసించకుండా అద్దెకు ఇస్తున్న వారికి, ఏండ్ల తరబడి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్న వారికి నోటీసులు జారీ చేయాలని, నోటీసులకు స్పందించని వారి ఇండ్లను రద్దు చేసి అర్హులకు కేటాయించాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సహచర మంత్రులు శ్రీధర్‌బాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్‌తో కలిసి క్యూర్ ఏరియాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై ఆయన సమీక్షించారు.
డబుల్ బెడ్రూమ్, జేఎన్ఎన్యూఆర్ఎం తదితర పథకాల్లో ఇండ్లు పొంది నివాసం ఉండని ఇండ్లను మే 1నుంచి పరిశీలించాలని, వారికి నోటీసులిచ్చి స్పందించకపోతే కేటాయింపులను రద్దు చేయాలని స్పష్టంచేశారు. నోటీసులకు స్పందించిన లబ్ధిదారుల నుంచి బాండ్ పేపర్‌పై తాము ఇకడే నివాసం ఉంటామని, లేదంటే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి అప్పగిస్తూ హామీ పొందాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు ఆమోదం తెలిపేలా అండర్ టేకింగ్ తీసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి జిల్లాల క్యూర్(కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో నివసించే పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాలను గుర్తించాలని ఆయన సూచించారు. నాలుగు జిల్లాల పరిధిలోని కాలనీల్లో విద్యుత్, తాగునీరు, డ్రైనేజ్ వంటి కనీస వసతులను తప్పనిసరిగా కల్పించాలని, ఈ విషయంలో జీహెచ్ఎంసీ సహకారం తీసుకోవాలని మంత్రి సూచించారు. 22వేల ఇండ్లకు యుద్ధప్రాతిపదికన విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం టవర్లు మొత్తం పూర్తయ్యేవరకూ వేచిఉండకుండా ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు కేటాయించాలని తెలిపారు. వివిధ కాలనీల్లో ఉన్న వాణిజ్య సముదాయాలను అద్దె ప్రాతిపదికన కాకుండా వేలం ద్వారా విక్రయించాలని, తద్వారా వచ్చే డబ్బును అకడి సొసైటీ, ప్రభుత్వం పేరిట జాయింట్ అకౌంట్లో జమ చేయాలని ఆదేశించారు. ప్రజాప్రయోజన కార్యాలయాల కోసం కూడా కొన్నింటిని కేటాయించాలని కోరారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, ఎండీ వీపీ గౌతమ్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మలాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.