సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 27: జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం సాధించాలని కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సంవత్సరానికి 3,750 ఎకరాల ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని సాధించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
అర్హత ప్రకారం రైతులకు ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ సూక్ష్మ నీటి సేద్యం, సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ వెదురు మిషన్, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి పథకం అమలు ప్రగతిని సమీక్షించారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణలో భాగంగా గోద్రేజ్ అగ్రోవేట్ ఆధ్వర్యంలో మండలాలవారీగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి పండరి, సంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్, ఏడీఎస్ అధికారులు, ఉద్యాన విభాగం సిబ్బంది పాల్గొన్నారు.