Jammu and Kashmir : ఇరాన్ అధ్యక్షుడు అయతొల్లా ఖమేనీ మృతితో కాశ్మీర్లో ముస్లింలు చేపట్టిన నిరసన ప్రదర్శన ఆందోళనకు దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి పోలీసులు, భద్రతా బలగాలు ఆంక్షలు విధించారు. అయితే, శనివారం నుంచి ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేశారు. దీంతో అక్కడ జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. గతవారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారు.
ఈ దాడుల్ని, ఖమేనీ మరణాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని షియా తెగ ముస్లింలు నిరసన చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలు ఆదివారం బాగానే సాగాయి. అయితే, సోమవారం శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్దకు భారీగా నిరసనకారులు వచ్చేందుకు ప్రయత్నించారు. ఇది సమస్యాత్మక ప్రాంతం కావడంతో పోలీసులు, భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో ఆందోళనకారులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. షాపుల్ని ధ్వంసం చేశారు. ఆ సమయంలో పోలీసులు, భద్రతా దళాలు కలిసి ఆందోళనకారుల్ని చెదరగొట్టాయి. టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా ఈ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. భారీగా బలగాల్ని మోహరించారు. చారిత్రక లాల్ చౌక్‌ను చుట్టూ కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి మూసేశారు. ఇలా మూసేయడం ఆరేళ్ల తర్వాత ఇదే మొదటిసారి.
ఇంటర్నెట్ వినియోగంపై కూడా ఆంక్షలు విధించారు. చారిత్రక జామియా మసీదును మూసి ఉంచారు. మసీదు పెద్ద మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌ను హౌజ్ అరెస్ట్ చేశారు. శుక్రవారం కూడా ఈ మసీదును తెరవలేదు. అయితే, శుక్రవారం నాటికి ఈ ప్రాంతంలో పరిస్థితి కాస్త శాంతించింది. ముస్లింలు శాంతియుతంగా ప్రార్థనలు చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలు లేకపోవడంతో పోలీసులు శనివారం ఆంక్షల్ని ఎత్తివేశారు. లాల్ చౌక్‌ను తెరిచారు. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయి. సాధారణ జనజీవనం మొదలైంది. వారం తర్వాత పరిస్థితులు చక్కబడటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.