ఖిలావరంగల్: వరంగల్ తూర్పు కోట ప్రాంతంలో సోమవారం రాత్రి మద్యం మత్తులో యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. కొమట్ల బండ వద్ద జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సంగరబోయిన సాయి (24) అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు కోటకు చెందిన స్నేహితులు సంగారబోయిన సాయి (23), బోళ్ల రాజేష్ రెండు రోజులుగా మద్యం తాగుతూ గొడవ పడుతున్నారు.
తూర్పు కోటలోని కొమట్ల బండ వద్ద మరోసారి గొడవ జరుగుతుండడంతో అదే ప్రాంతానికి చెందిన బంగారి వినీత్ మధ్యలో వచ్చాడు. మాకు సంబంధించిన గొడవతో నీకేం సంబంధం అంటూ సాయి అతని నెట్టు వేశాడు. దీంతో వినీత్ తన బంధువులకు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న బంగారి నవీన్, రాజుతో పాటు మరి కొంతమంది యువకులు సాయి పై విచక్షణ రహితంగా దాడి చేశారు.
మద్యం మత్తులో తలెత్తిన ఈ ఘర్షణ పెరిగి, సాయిపై నిందితులు విచక్షణారహితంగా ప్రత్యేక దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన సాయి స్పృహ కోల్పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీసుల సూచన మేరకు కుటుంబ సభ్యులు సాయిని చికిత్స నిమిత్తం ఎంజీఎం (MGM) హాస్పిటల్కు తరలించగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించినట్లు తెలిసింది. మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మద్యం మత్తులో జరిగిన ఈ ఘర్షణ తూర్పు కోట ప్రాంతంలో విషాద వాతావరణాన్ని సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తూర్పు కోటలో ఉద్రిక్తత
తూర్పు కోటలో సంగరబోయిన సాయిని విచక్షణహితంగా దాడి చేయడంతో మృతి చెందడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దాడి చేసిన యువకులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు కూడా రాత్రికి రాత్రే పారిపోయారు. దాడికి పాల్పడిన యువకుల ఇళ్లపై ఎక్కడ దాడులకు పాల్పడతారేమోనని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.