Womens Health | మహిళల ఆరోగ్యం జీవశాస్త్రం, హార్మోన్ల కారణంగా కొన్ని వ్యాధులు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. పురుషులు, మహిళలు కొన్ని వ్యాధులకు సమానంగా గురవుతారు. కానీ హార్మోన్ల మార్పులు, పునరుత్పత్తి ఆరోగ్యంతో సంబంధం ఉన్న సమస్యలు మహిళల్లో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు, PCOS, ఆటోఇమ్యూన్ వ్యాధులు, ఆస్టియోపొరోసిస్, రక్తహీనత వంటి సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మహిళలు ఇబ్బందిపడుతున్నారు. ఈ వ్యాధులు పురుషుల కంటే మహిళల్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయని అయినప్పటికీ ఈ వ్యాధులను చాలా మంది సరైన సమయంలో గుర్తించరని వైద్యులు చెబుతున్నారు. పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపించే కొన్ని వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. థైరాయిడ్ అనేది ఎండోక్రైన్ వ్యవస్థలో భాగమైన చిన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న గ్రంథి. ఇది మెడ ముందు భాగంలో చర్మం కింద ఉంటుంది. ఈ గ్రంథి థైరాక్సిన్ (T4), ట్రైయోడోథైరోనిన్ (T3) అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి శరీరంలోని అనేక ముఖ్యమైన పనులను నియంత్రిస్తాయి. Indian Journal of Endocrinology and Metabolism ప్రకారం దాదాపు 15.86% మహిళల్లో థైరాయిడ్ సమస్యలు కనిపిస్తున్నాయి. అలాగే మహిళల్లో ఎక్కువగా కనిపించే మరో సమస్య PCOS (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్). PCOS అనేది మహిళల్లో కనిపించే సాధారణ హార్మోన్ల సమస్య. ఇందులో ఆండ్రోజెన్ హార్మోన్లు సాధారణ కంటే ఎక్కువగా ఉంటాయి. దీంతో పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అండోత్పత్తి సమస్యలు, గర్భం దాల్చడంలో ఇబ్బందులు, ముఖం లేదా శరీరంపై ఎక్కువ వెంట్రుకలు, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రసవ వయస్సులో ఉన్న మహిళల్లో 10-13% మందికి PCOS ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70% మహిళలకు తమకు PCOS ఉందని తెలియదు. వీటితో పాటు ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా మహిళల్లో ఎక్కువగా వస్తున్నాయి. ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ తప్పుగా ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేస్తుంది. దీని వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రోన్స్ వ్యాధి, థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇవి దీర్ఘకాలిక వ్యాధులు కనుక వీటి లక్షణాలను జీవితకాలం నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఆస్టియోపొరోసిస్‌ను ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే వ్యాధిగా భావించేవారు. కానీ ఇప్పుడు 30-40 సంవత్సరాల మహిళల్లో కూడా ఎముకలు బలహీనపడటం కనిపిస్తోంది. ఆస్టియోపొరోసిస్ ఒక ఎముకల వ్యాధి. ఇందులో ఎముకల సాంద్రత తగ్గడంతో పాటు ఎముక నిర్మాణం బలహీనపడుతుంది. దీంతో ఎముకలు సులభంగా విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చిన్న గాయం కారణంగా కూడా ఫ్రాక్చర్ వచ్చే అవకాశంపెరుగుతుంది. ఆస్టియోపొరోసిస్‌ను చాలాసార్లు సైలెంట్ డిసీజ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఎముక విరిగే వరకు సాధారణంగా లక్షణాలు కనిపించవు.
ఐరన్ డెఫిషియెన్సీ అనీమియా ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ పోషక లోప వ్యాధుల్లో ఒకటి. పీరియడ్స్, గర్భధారణ, ఆహారపు అలవాట్ల కారణంగా మహిళలు దీనికి ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఈ వ్యాధి రక్తంలోని రెడ్ బ్లడ్ సెల్స్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వారిలో తీవ్రమైన అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి సాధారణంగా ఐరన్ మాత్రలు లేదా ఐరన్ ఇన్ఫ్యూషన్ల ద్వారా చికిత్స చేస్తారు. మహిళల్లో కనిపించే ఈ ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం, లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండడం ద్వారా ఈ వ్యాధులను నియంత్రించవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.