మెదక్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుపై జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నీళ్లు చల్లింది. సరైన సౌకర్యాలు లేవని అనుమతులకు నిరాకరించింది. దీంతో మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసి ఆ తర్వా త నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ఆధునిక హంగులతో నిర్మించింది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటులో భాగంగా మెదక్‌కు మంజూరు చేశారు.
100 సీట్లతో కూడిన భవన నిర్మాణానికి రూ.180 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏండ్ల కల నెరవేరిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కానీ, మెడికల్ కళాశాల ఏర్పాటుకు వసతులు సరిగా లేవనే కారణంతో జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) ఇటీవల అనుమతి నిరాకరించడంతో జిల్లా ప్రజలు నిరాశ చెందుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ జిల్లాకేంద్రంలో 100 సీట్లతో మెడికల్ కళాశాల ఏర్పాటుకు 2023లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి గతేడాది జూన్‌లో జీవో జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేసి, పరిపాలనా అనుమతుల కోసం సెప్టెంబర్ 16న జీవో నంబర్ 162 జారీచేసింది. మెడికల్ కళాశాలలో అవసరమైన 433 పోస్టులను సృష్టించి గతేడాది సెప్టెంబర్‌లో జీవో నంబర్ 123 విడుదల చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 100 సీట్లు కేటాయిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని 50 సీట్లకు కుదించింది. మెదక్‌లో మెడికల్ కళాశాల భవనం ఏర్పాటు చేయాలంటే అన్ని వసతులు ఉండాలి.
భవనం ఎక్కడ దొరకక పోవడంతో పాత కలెక్టరేట్ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. యాజమాన్యం అనుమతి ఇవ్వడంతో భవనానికి మరమ్మతులు, రంగులు వేశారు. జూలై లో జరిగిన వర్చువల్ సమావేశంలో జాతీయ వైద్యమండలి అధికారులు చూపిన సమస్యలు అన్నింటినీ పరిష్కరించారు. తాజాగా వసతులు లేవని అనుమతులు నిరాకరించడంతో మెడికల్ కళాశాల ఏర్పా టు అవుతుందో లేదోనన్న అనుమానం జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది.
పాత కలెక్టరేట్ భవనంలో వసతులు సరిగా లేవని ఎన్ఎంసీ అనుమతి నిరాకరించింది. వైద్య పరికరాలు, ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు సరిగా లేవని పేర్కొంది. తరగతుల నిర్వహణకు ఎంపిక చేసిన భవనంలో సరైన వసతులు లేవని, భవన లీజు విషయంలోనూ ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 30 ఏండ్ల వరకు ఉండాలనే విషయాలు అగ్రిమెంట్లో పొందుపర్చలేదని తెలిసింది. మెడికల్ కళాశాలకు జిల్లా కేంద్ర దవాఖానకు అనుసంధానం చేశారు. కళాశాలకు ఎనిమిది విభాగాల్లో బోధకులు అవసరం.
ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించగా పలువురు చేరారు. మొత్తంగా ఇప్పటివరకు 45 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వచ్చారు. ఇటీవల ఎన్ఎంసీ అధికారులు వర్చువల్ ద్వారా తనిఖీలు చేశారు. సౌకర్యాలు, సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర అధికారులు ఎన్ఎంసీకి అందజేసి అనుమతి ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కానీ, సరైన సౌకర్యాలు లేవన్న కారణంతో ఎన్ఎంసీ అనుమతి నిరాకరించింది. ఇప్పుడు మళ్లీ అప్పీల్‌కు వెళ్లనున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నాయి. ఈ అప్పీల్‌కు వారం రోజులే గడవు ఉంటుందని అం టున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని అనుమతి తెస్తుం దో..లేదో వేచి చూడాలి.