మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్ 24: సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని పలు గ్రామాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గ్రామాల్లో గుంపులుగుంపులుగా తిరుగుతూ పలువురిపై కుక్కలు దాడి చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కలు దాడులకు తెగబడుతున్నాయి. కుక్కల దాడిలో ఎంతోమంది గాయపడి దవాఖానలపాలవుతున్నారు. దీనికితోడు కుక్కలు రోడ్లపై తిరుగుతూ వాహనచోదకులకు అడ్డు వస్తుండడంతో వాహనాలపై నుంచి పడి పలువురు గాయపడిన సంఘటనలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలిగించకపోవడంతో చెత్తకుప్పలను వీధికుక్కలు ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి.
దీనికితోడు గ్రామాల్లోని చికెన్సెంటర్ల వద్ద కుక్కలు గుంపులుగుంపులుగా తిరుగుతున్నాయి. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ కుక్క వస్తుందోనన్న భయంతో జనాలు కాలంవెళ్లదీస్తున్నారు. వీధి కుక్కల భయానికి ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే ప్రజలు జంకుతున్నారు. మద్దూరు, లద్నూర్ పీహెచ్సీలో రోజూ పదుల సంఖ్యలో ఏఆర్వీ వ్యాక్సిన్ కోసం వస్తున్నారని వైద్యాధికారులు తెలిపారు. వీధి కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన పంచాయతీ అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి గ్రామాల్లో వీధి కుక్కలను నియంత్రించి వాటిబారి నుంచి జనాలను కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.