సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఆస్తులను కొల్లగొట్టి బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చూస్తూ ఊరుకోబోరని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ కోసం 450 కుటుంబాలున్న మధు పార్క్ రిడ్జ్ను ఖాళీ చేయాలని వచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు ఆయన ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వెళ్లి అక్కడి నివాసితులకు భరోసా కల్పించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ అపార్ట్మెంట్ నివాసితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న విధ్వంసాన్ని అడ్డుకుని తీరుతామని హామీ ఇచ్చారు. అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకునే దాకా పోరాటాలు చేస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ శ్రేణులు బాధితుల పక్షాన నిలబడి కొట్లాడతారన్నారు. మధు పార్క్ రిడ్జ్‌తో పాటు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొన్న బాధితులందరి పక్షాన రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పట్టుబడతామన్నారు. ప్రభుత్వం దిగివచ్చే దాకా అలుపెరుగని పోరాటం చేస్తామని చెప్పారు. అపార్ట్మెంట్ వాసులు ఎలాంటి భయాందోళనలు చెందకుండా ఉండాలని పిలుపునిచ్చారు. మూసీని శుద్ధి చేయడానికి బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాదని, దాని సాకుతో పేదల భూములు, ఇండ్లను చెరబడితే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.
కేసీఆర్ హయాంలో సుమారు రూ.4వేల కోట్లతో మూసీ మురుగును శుద్ధి చేసేందుకు 38 ఎస్టీపీలు నిర్మించాం. 2023లోనే ఇంకా 94 ఎస్టీపీల పనులను 80 శాతానికి పైగా పనులు పూర్తి చేశాం. కానీ, ఒక్క బస్తీ, ఒక్క ఇంటిని కూడా ముట్టుకోలేదు. ప్రజల ఇం డ్లను కూల్చకుండా, వారికి అసౌకర్యం కలిగించకుండా మూసీ శుద్ధీకరణ చేయడం బీఆర్ఎస్ విధానం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మా త్రం మూసీ సుందరీకరణ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజల ఇండ్లు, భూములను చెరబడుతున్నది. ప్రజల ఆస్తులు కొల్లగొట్టి అభివృద్ధి చేస్తామంటే చూస్తూ ఊరుకోబోం. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇక్కడి ప్రజలకు ప్రభుత్వ నోటీసులు ఇచ్చిం ది. 2020లో భారీ ఎత్తున వర్షం పడ్డప్పుడే మధు పార్క్ అపార్ట్మెంట్లోకి చుక్క నీరు రాలేదు. అలాంటి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామనడం కాంగ్రెస్ వక్రబుద్ధికి నిదర్శనం. మూసీ బాధితులకు బీఆర్ఎస్ తరఫున కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు సహా అందరం అండగా ఉంటాం. మళ్లీ వచ్చే కేసీఆర్ ప్రభుత్వమే.. అప్పుడు మూసీ మురికిని పారదోలి చూపిస్తాం. -సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే
కొద్దిరోజులుగా మధు పార్క్ అపార్ట్‌మెంట్‌వాసుల బాధలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. మీడియా ఎదుట తమ ఆవేదన చెప్పుకొంటూ రోదిస్తుంటే భావోద్వేగం ఆపులేకపోతున్నా. తమ ఇండ్లను ఖాళీ చేయబోమంటున్న ఆడబిడ్డల ఆవేదన చూస్తుంటే చలించిపోయా. పది రూపాయలతో నీళ్లల్లో విషం కలిపి తమను చంపేసి అపార్ట్‌మెంట్‌ను తీసుకోవాలని ఆవేదన చెందిన ఓ తల్లి బాధ కంట తడి పెట్టించింది. కాంగ్రెస్ ప్రభుతానికి కొంచమైనా మానవత్వం లేదు. ప్రజల భూములు లాక్కొని, ఇండ్లను కూల్చి అభివృద్ధి చేస్తామనడం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ శుద్ధీకరణకు ఎన్నో పనులు చేపట్టింది.
అభివృద్ధి పేరిట ఒక్క ఇంటిని కూడా టచ్ చేయొద్దని కేసీఆర్ చెప్తుండేవారు. అప్పులు చేసి కట్టుకున్న పేదల ఇండ్లు మూసీలో మునిగిపోకుండా ఉండాలని కేసీఆర్ ఎస్ఎన్డీపీ నాలాలు కట్టించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అభివృద్ధి జరగాలని, అందుకు ఎంత ఖర్చయినా పర్వాలేదనేది కేసీఆర్ నినాదం. భూములు చెరబట్టి, ఇండ్లను కూల్చలనుకోవడం సీఎం రేవంత్‌రెడ్డి విధానం. గాంధీ విగ్రహం పెడితే ఎవరూ అడ్డు చెప్పరు. కానీ విగ్రహం పెట్టేందుకు ప్రజల ఇండ్లను కూలుస్తామంటేనే సహించం. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి ఎక్కడ చూసినా భూములు లాక్కోవడమే ఎజెండాగా పెట్టుకున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలైనా చేస్తాం. మధు పార్క్ నివాసితులకు భరోసా ఇచ్చేందుకు వచ్చిన హరీశ్‌రావుకు, బీఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు.
-సబితాఇంద్రారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని మధు పార్క్ అపార్ట్ మెంట్ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లను కూల్చి, భూములను లాక్కొని విగ్రహం కట్టాలని గాంధీజీ కోరుకోరని స్పష్టం చేశారు. గాంధీ అహింసామార్గాన్ని అనుసరిస్తే.. ఆయ న పేరు చెప్పుకొని బతుకుతున్న కాంగ్రెస్ పార్టీ హింసామార్గంలో ప్రజలను వేధిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను కొట్టి వ్యాపారులకు కట్టబెడుతున్నదని..
మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా జీవిస్తారని అన్నారు. కేసీఆర్ వస్తేనే హైదరాబాద్ ప్రజలకు రక్షణ ఉంటుందని.. కేసీఆర్ హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మారిస్తే.. రేవంత్‌రెడ్డి పాతాళానికి నెడుతున్నారని ఆరోపించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ వస్తేనే నగర ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారని అభిప్రాయపడ్డారు. ‘కం బ్యాక్ కేసీఆర్.. కం బ్యాక్ కేసీఆర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళల నినాదాలు ఆ ప్రాంతమంతా మార్మోగాయి.