కరీంనగర్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మేడిగడ్డ ప్రాజెక్టు అవసరం లేదు. ఎల్లంపల్లి ఉంటే చాలు’ అంటూ చెప్పిన కాంగ్రెస్ నేతలకు ప్రకృతే మరోసారి కాళేశ్వరం అవసరాన్ని తెరపైకి తెచ్చింది. కేసీఆర్ రీడిజైనింగ్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆవశ్యకత ఏమిటో కండ్లకు కడుతున్నది. ఒకవైపు, వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా ఎల్లంపల్లికి మాత్రం ఇన్‌ఫ్లో తగ్గింది. మరోవైపు, మేడిగడ్డ వద్ద మాత్రం గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. లక్ష్మీ బరాజ్ మీదుగా వేలాది టీఎంసీల నీరు దిగువకు వెళ్తున్నది. అయితే, ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మొదలుకొని కొండపోచమ్మసాగర్ వరకు జలాశయాలు వెలవెలబోతున్నాయి. అందుకే, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ఆధారపడకుండా కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం ఎత్తిపోతలకు రీడిజైనింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని నిపుణులు చెప్తున్నా.. మొండిగా వాదిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడేమి సమాధానం చెబుతారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దిగువన గోదావరి ఉప్పొంగి పారుతున్నా.. వాటిని ఎత్తిపోయడంలో సర్కార్ చూపుతున్న నిర్లక్ష్యం రైతులకు శాపంగా పరిణమిస్తున్నది. దీనికి నిలువెత్తు నిదర్శనం.. ఎత్తిపోతలను సర్కార్ నిలిపివేయడమే! గోదావరిపైనే ఎల్లంపల్లికి ఇన్‌ఫ్లో తగ్గి.. కాళేశ్వరం వద్ద గోదావరి ఎందుకు నిండుగా పారుతుందన్న ప్రశ్నకు సమాధానమే.. కాళేశ్వరం ప్రాజెక్టు అనే సమాధానం వినిపిస్తున్నది.
ఇటీవల పడిన వర్షాల వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చిన నీటిని మధ్యమానేరు ప్రాజెక్టు వరకు ఎత్తిపోశారు. గత నెల 29 నుంచి ఈ నెల 11 వరకు ఎత్తిపోతలు కొనసాగాయి. ఎల్లంపల్లి జలాశయం నుంచి నందిమేడారం- గాయత్రీ పంపుహౌస్‌ల ద్వారా మధ్యమానేరుకు, అలాగే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద వరద కాలువకు నీటిని ఎత్తిపోశారు. మొత్తం పదిహేను రోజుల్లో 16.5 టీఎంసీల నీటిని తరలించారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఎల్లంపల్లికి ఇన్‌ఫ్లో తగ్గింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.1754 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.8508 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. ఇక్కడ ఇన్‌ఫ్లో 282 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నది. దీంతో ఇక్కడినుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం లేదు. మళ్లీ వర్షాలు పడి నీరు వస్తే తప్ప, ఈ ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయడం కుదరదు. ఎందుకంటే, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీతోపాటు హైదరాబాద్‌కు తాగునీరు, అదేవిధంగా ఎరువుల కర్మాగారానికి, మిషన్ భగీరథకు నీటిని నిత్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. పదిహేను రోజులపాటు ఎత్తిపోసిన నీటితో మిడ్‌మానేరు ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండలేదు. మధ్యమానేరు పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.949 టీఎంసీలు ఉన్నాయి. లోయర్ మానేరు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి కూడా అదే. అనంతగిరి, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, మల్కపేట, కొండ పోచమ్మసాగర్, బస్వాపురం రిజర్వాయర్లతోపాటు ఎత్తిపోతల ద్వారా నీటిని నింపాల్సిన అనేక జలాశయాలు, చెరువుల్లో నీరు అంతంత మాత్రమే ఉన్నది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. వర్షం పడితే తప్ప, నీళ్లు వచ్చే పరిస్థితులు మళ్లీ లేవు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన 141 టీఎంసీల సామర్థ్యం ఉన్న అనేక ప్రాజెక్టులు నీళ్లు లేక వెలవెల పోతున్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో లక్షలాది ఎకరాల్లో రైతులు పంటలు వేసి సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. సర్కార్ మాత్రం మొండివైఖరికి పోయి.. మేడిగడ్డ వద్ద నుంచి నీటిని ఎత్తిపోయడం లేదు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 87వేల పైచిలుకు క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ఈ నెల 13న 1,54,700 క్యూసెక్కుల నీరు మేడిగడ్డ మీదుగా దిగువకు వెళ్లింది. నిజానికి, సర్కార్ మొండిపట్టుకు పోకుండా కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తే.. ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులను నింపుకొనే అవకాశం ఉన్నది. ఉత్తర తెలంగాణకు గ్రావిటీ ద్వారా వచ్చే అతి పెద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా అనుకున్న స్థాయిలో ఇన్‌ఫ్లో రావడం లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చిన ప్రతినీటి చుక్కనూ ఒడిసి పట్టుకోవాల్సిన సర్కార్.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా పరిస్థితులు.. కేసీఆర్ చేసిన రీడిజైనింగ్ అవశ్యకతను మరోసారి నొక్కి చెప్తున్నాయి. నాలుగు వర్షాలు పడగానే.. ఎల్లంపల్లి ఒక్కటి ఉంటే చాలు, కాళేశ్వరం అవసరమే లేదని గోబెల్ ప్రచారాలు చేస్తూ అబద్ధాలు చెప్తున్న కాంగ్రెస్ నాయకులకు.. ప్రస్తుతం కాలమే సమాధానం చెప్తున్నది. ఆనాడు ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జిల్లాలోని తమ్మడిహట్టి వద్ద 152 మీటర్ల పూర్తి స్థాయి మట్టంతో బరాజ్ నిర్మించి 160 టీఎంసీల ప్రాణహిత నీటిని ఎల్లంపల్లి బరాజ్‌కు, అక్కడినుంచి మిడ్‌మానేరు నుంచి చేవెళ్ల వరకు తరలించాలని ప్రతిపాదించారు. ఈ విషయంపై తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ సర్కార్ కూలంకషంగా సమీక్ష చేసింది. రీ డిజైన్ చేయాల్సిన అవసరం ఉన్నదని భావించింది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు దిగువ గోదావరిలో పుష్కలంగా లభ్యమయ్యే నీటితో తిరిగి పునరుజ్జీవింపచేయడమే లక్ష్యంగా కాళేశ్వర పథకాన్ని చేపట్టింది.