అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఓ అధికారి దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న చందంగా తాను ఉద్యోగంలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు. తనకు పెద్దల అండదండలు ఉన్నాయని, తాను ఏం చేసినా అడిగేవారు లేరని రెచ్చిపోతూ ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు, కిందిస్థాయి సిబ్బందిని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. పిల్లల నోటికాడి బుక్కకు ఆశపడుతున్న సదరు అధికారి మూట ముట్టనిదే ఫైళ్లపై సంతకం పెట్టడనే ఆరోపణలు ఉన్నాయి.
-సుబేదారి, ఫిబ్రవరి 22
హనుమకొండ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి మామూళ్ల మత్తులో మునిగితేలుతున్నాడు. అతడి అవినీతికి అడ్డూఅదుపు లేకుండాపోయింది. పోస్ట్‌మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్ల నిర్వహణకు సంబంధించిన పిల్లల వసతి, భోజనం, సామగ్రి, పుస్తకాలు, హాస్టళ్ల మెయింటనెన్స్, అత్యవసర ఖర్చులు, మంజూరు బిల్లులపై కమిషన్ ముట్టిన తర్వాతనే ఫైళ్లపై సంతకం పెడతాడనేది ఆ శాఖలో ఓపెన్ సీక్రెట్. ఇవేకాకుండా వార్డెన్ల బదిలీలు, పదోన్నతుల విషయంలో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తనకు హైదరాబాద్ హెడ్ఆఫీస్లో పలుకుబడి ఉందని, తనను ఎవరూ ఏం చేయలేరు.. ఇక్కడి నుంచి కదిలించలేరని, పెద్దల అండదండలు ఉన్నాయని ఆ అధికారి రోజురోజుకూ రెచ్చిపోతున్నాడు. వార్డెన్లు, మిగతా స్టాఫ్‌ను బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో 3 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న ఒక్కో విద్యార్థికి మెస్ చార్జీల కింద నెలకు రూ.1340, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1400, పోస్ట్ మెట్రిక్ ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున ప్రభుత్వం ప్రతి నెలా మెస్ చార్జీలు చెల్లిస్తున్నది.
బియ్యం ఉచితంగానే అందజేస్తున్నది. ఈ మెస్ ఫీజులతో వార్డెన్లు హాస్టల్ విద్యార్థులకు కూరగాయాలు, చికెన్, మటన్, పాలు, గుడ్లతో రుచికరమైన భోజన వసతి కల్పిస్తారు. అయితే, సదరు అధికారి ప్రీ మెట్రిక్ హాస్టళ్ల వార్డెన్ల నుంచి ఒక్కో విద్యార్థి నెలవారీ మెస్ ఫీజులో రూ.30, పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ విద్యార్థుల మెస్ ఫీజులో రూ.40 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెస్ ఫీజుల బిల్లుల విషయంలో పక్కాగా సదరు అవినీతి అధికారి వార్డెన్ల నుంచి ముడుపులు తీసుకున్న తర్వాతనే బిల్లుల ఫైళ్లపై సంతకం చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు అధికారి రెండేళ్లుగా మెస్‌చార్జీల కమిషన్లు, హాస్టళ్ల తనిఖీలు, సంఘాల చందాల పేరుతో పెద్దమొత్తంలో వార్డెన్ల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తున్నది.
మచ్చుకు కొన్ని..