మేడ్చల్, ఫిబ్రవరి 22 : మేడ్చల్ పట్టణంలో నీటి సమస్య రోజురోజుకూ అధికమవుతున్నది. ప్రజలు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. ట్యాంకర్ల నీరే దిక్కవుతూ ప్రజలపై అదనపు భారం పడుతున్నది. ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. నీటి సరఫరాను పెంచడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్‌లో ప్రధానంగా నీటి సమస్య చర్చనీయాంశంగా మారింది.
పదేళ్ల కిందటి దుస్థితి పునరావృతం
మేడ్చల్‌లో భూగర్భ జల మట్టం తక్కువగా ఉండటంతో ప్రజలు 40 ఏండ్లపాటు బాధలు పడ్డారు. డిసెంబర్ నుంచే ప్రజలు నీటి ట్యాంకర్లపై ఆధారపడే వారు. ఆ పరిస్థితిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్పు తీసుకొచ్చింది. నీటి గోసకు మిషన్ భగీరథ పథకం చరమగీతం పాడింది. మిషన్ భగీరథ నీటి సరఫరా ప్రారంభమైనప్పటి నుంచి గతేడాదిన్నర వరకు మండు వేసవిలోనూ నీటి ట్యాంకర్ రోడ్డుపై కన్పించని పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించింది. దాదాపు 10 ఏండ్ల తర్వాత మళ్లీ అవే కష్టాలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్ జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత కూడా సమస్యకు పరిష్కారం లభించడం లేదు.
డిమాండ్‌కు తగిన నీటి సరఫరా లేకే..
మిషన్ భగీరథ రాకతో బోర్ల వాడకం కూడా గణనీయంగా తగ్గింది. రోజు విడిచి రోజు పుష్కలంగా నీరు రావడంతో మేడ్చల్ పట్టణ ప్రజలకు నీటి కష్టాలు లేకుండా పోయాయి. ఎల్లంపేట మున్సిపాలిటీ ఘనపూర్ క్షేత్ర గిరిగట్టుపై నగర నీటి అవసరాలను తీర్చేందుకు నిర్మించిన మాస్టర్ బ్యాలెన్సీంగ్ రిజ్వరాయర్ నుంచి మేడ్చల్ మున్సిపాలిటీ, మండలాలకు నీటిని మిషన్ భగీరథ పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గతంలో డిమాండ్‌కు తగ్గట్టు నీటి సరఫరా జరగడంలో మండు వేసవిలోనూ నీటి ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తలేదు. అయితే జల మండలి అధికారులు మేడ్చల్ పట్టణానికి ఇచ్చే 7.5 ఎంఎల్డీ నీటిని 3.5 ఎంఎల్డీకి తగ్గించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. నీటి సరఫరా తగ్గడం, బోరు బావుల్లో నీరు అడుగంటడంతో ప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు రోజులకు ఒకమారు, కొన్ని ప్రాంతాల్లో వారానికి రెండు సార్లు వేళాపాలా లేకుండా నీటిని సరఫరా చేస్తుండడంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది. మేడ్చల్ పట్టణంలోని ఉమానగర్, బాలాజీనగర్, రాఘవేంద్రగనర్, గోకుల్‌నగర్, కేఎల్ఆర్ వెంచర్‌తోపాటు పాత పట్టణంలోని పలు ప్రాంతాలకు నీటి కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ట్యాంకర్లతో నీటి కొనుగోలు
మిషన్ భగీరథ నీరు అంతంత మాత్రంగా సరఫరా కావడం, బోరుబావుల్లో నీరు అడుగంటడంతో ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని పలువురు నీటి వ్యాపారంపై దృష్టి సారించారు. మిషన్ భగీరథ రాకతో నీటి అవసరాలు తీరాయి. ట్యాంకర్లతో ప్రజలు నీళ్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దీంతో ట్యాంకర్ల మూలనపడ్డాయి. పలువురు తమ ట్యాంకర్లను అమ్ముకున్నారు. ఇతరత్రా అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నారు. కానీ గత ఏడాది నుంచి నీటి డిమాండ్ పెరగడంతో కొత్త ట్యాంకర్లు రోడ్లపై కన్పిస్తున్నాయి. మేడ్చల్ పట్టణంలో ఏ చోట అయినా 15 నిమిషాలు రోడ్డుపై నిలపబడితే తక్కువలో తక్కువగా 10 ట్యాంకర్ల సంచరించడం కన్పిస్తున్నాయి. అంటే ప్రజలపై ఎంత భారం పడుతుందో అర్థం చేసుకోవచ్చు.
అదనపు భారం
నీళ్ల కొనుగోలుతో ప్రజలపై అదనపు భారం పడుతుంది. బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న వారికి ట్యాంకర్ల నీటి వినియోగం తప్పడం లేదు. ఉమానగర్‌లో 23 ప్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లో నీటి సరఫరా జరగని రోజు రెండు ట్యాంకర్ల నీటిని ట్యాంకర్ రూ.650 వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఆ అపార్ట్మెంట్ నిర్వహణకు ప్రతి ప్లాటు యజమాని రూ.1000 చెల్లిస్తుండగా నీటి కోసం అదనంగా మరో రూ.600 నుంచి రూ.700 వరకు భారం మోయాల్సి వస్తుంది. మేడ్చల్‌లో ఇలాంటి అపార్ట్మెంట్లు, నివాస గృహాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఒక్కో ట్యాంకర్ కనీసం 15 ట్రిప్పుల నీటిని సరఫరా చేసినా రూ.10వేల వ్యాపారం చేస్తుంది. మేడ్చల్‌లో వందల సంఖ్యలో ట్యాంకర్ల తిరుగుతున్నాయి. వాటి వ్యాపారం రూ.లక్షల్లో సాగుతుంది. దీంతో ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు నీటి సరఫరాను పెంచి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.