Uttar Pradesh : పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థతో లింకు కలిగిన ఉగ్రవాద సానుభూతిపరుడిని ఉత్తర ప్రదేశ్‌లో ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) పోలీసులు అజాంఘడ్‌లో అరెస్టు చేశారు. నిందితుడిని యూపీ. అజాంఘడ్ ప్రాంతం, నిజామాబాద్ సమీపంలోని ఖుద్దాపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ షేక్‌గా గుర్తించారు. నిందితుడికి పాకిస్తాన్లో ఒక ఉగ్రవాద సంస్థను నిర్వహిస్తున్న గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టితో సంబంధాలు కలిగి ఉన్నాడు. భట్టికి పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సంస్థ సహకారం అందిస్తోంది.
అలాంటి సంస్తలతో మొహమ్మద్ షేక్ కలిసి పని చేస్తున్నాడు. యూపీలోని ఏటీఎస్ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. పాక్ గ్యాంగ్‌స్టర్ భట్టి ఇండియాలో తన నెట్వర్క్ విస్తరించాలనుకుంటున్నట్లు భారత ఇంటెలిజెన్స్ సమాచారం. మతపరంగా రెచ్చగొట్టడం, ఉగ్రవాదం వైపు నడిపించడంతోపాటు డబ్బును ఎరగా చూపి ఇండియాలోని యువతను తీవ్రవాదం వైపు నడిపిస్తూ తన నెట్‌వర్క్‌లో చేర్చుకుంటున్నాడు. ఇందుకోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించుకుంటున్నాడు. ఇలా నియమించుకున్నవారిని స్లీపర్ సెల్స్‌గా పిలుస్తారు. వీళ్లు అవసరమైనప్పుడు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఇక.. మొహమ్మద్ షేక్‌ను దుబాయ్, పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా భట్టి గ్రూప్ రిక్రూట్ చేసుకుంది.
ఇతడికి భట్టి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ‘ట్రయల్ మిషన్’ అప్పగించాడు. దీని ప్రకారం అతడు మరో రాష్ట్రానికి చెందిన ఒక మహిళా రాజకీయ నేతను హత్య చేయాలి. ఇందుకు అతడు అంగీకరించాడు. భవిష్యత్‌లో ఆమెను చంపేలా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు. ఇందుకోసం 9ఎంఎం పిస్టోల్ కూడా కొన్నాడు. అంతేకాదు.. తనతోపాటు కొందరు యువతను తనలాగే ఉగ్రవాదం వైపు నడిపించేలా ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి ఉపా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.