హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): అధికారం కోసం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట బూటకపు మాటలు చెప్పిన కాంగ్రెస్ బీసీలకు తీరని ద్రోహం చేసిందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రెండేండ్లుగా ఊదరగొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి బలహీనవర్గాల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లకు 50 శాతం వరకే పరిమితి ఉన్నదని తెలిసినా నమ్మించేందుకు యత్నించారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల పెంపును రేవంత్ ప్రభుత్వం ప్రహసనంగా మార్చిందని ద్వజమెత్తారు.
బీసీ కమిషన్ వేసి కులగణన చేపడుతామని ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిందని బండా ప్రకాశ్ ఆరోపించారు. మొదట బీసీ గణన చేస్తామని చెప్పి నాలుక కరుచుకొని చివరకు సమగ్ర కులగణన సర్వేకు ఉపక్రమించిందని గుర్తుచేశారు. సర్వే అంతా తప్పుల తడకగా నిర్వహించారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే బీసీల జనాభాను 46 శాతానికి తగ్గించి చూపారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో కచ్చితమైన వివరాలు అందాయని, బీసీ జనాభా 51 శాతానికిపైగా తేలిందని గుర్తుచేశారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారు తెచ్చిన బీసీ బిల్లులు లోపభూయిష్టమని తెలిసినా బీఆర్ఎస్ మద్దతిచ్చిందని ప్రకాశ్ చెప్పారు. కానీ రాష్ట్రపతి వద్దకు బీసీ బిల్లులు పంపిన రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ వాటి ఆమోదానికి చిత్తశుద్ధి చూపలేదని ఆరోపించారు. ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద డ్రామాలు ఆడటం తప్ప చేసిందేమీలేదని మండిపడ్డారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్లో బీసీ కోటా కోసం పోరాడలేదని విమర్శించారు. బిల్లులు అసెంబ్లీలో పెట్టగానే, ఆర్డినెన్స్‌లు ఇవ్వగానే కొందరు రేవంత్‌రెడ్డికి పాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారని ఎద్దేవా చేశారు. బీసీలకు 42 శాతం కోటాను ప్రతిపాదిస్తూ కమిషన్ నివేదిక ఇచ్చిన రోజు ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్‌గా జరుపుకోవాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కోటా ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్తున్నందున ఫిబ్రవరి 4ను విద్రోహ దినంగా పాటిస్తారా? అని ప్రశ్నించారు.
బీసీ కోటా సాధనలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లడం దుర్మార్గమని బండా ప్రకాశ్ మండిపడ్డారు. జీవో 46తో బలహీనవర్గాలకు తీరని అన్యాయం జ రుగుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలని, 42 శాతం కోటా ఇచ్చిన తర్వా తే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీ ఫాంలు లేకుండా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీపరం గా రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పార్టీపరంగా ఇచ్చే రిజర్వేషన్లపై క్యాబినెట్లో నిర్ణయం తీ సుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ప్రభుత్వానికి బుద్ధిచెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
కాంగ్రెస్‌కు బీసీలంటే మొదటి నుంచి అలుసేనని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. ఆ పార్టీ మోసానికి ప్రతీక అని విరుచుకుపడ్డారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచామని బీహర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని అన్నారు. ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డి ఊసరవెల్లిలా రంగులు మార్చి బలహీనవర్గాలను వంచించారని నిప్పులు చెరిగారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చితేనే బీసీ కోటాకు రక్షణ వస్తుందని తెలిసినా ఏనాడూ ఆ దిశగా ప్రయత్నించలేదని మండిపడ్డారు. కానీ కేసీఆర్ హామీలు ఇవ్వకున్నా బీసీలకు ఎంతగానో మేలు చేశారని కొనియాడారు. మార్కెట్ కమిటీల్లోనూ కోటా ఇచ్చి సముచిత గౌరవమిచ్చారని గుర్తుచేశారు. బీసీలను అడుగడునా మోసం చేసిన రేవంత్‌రెడ్డికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్లపై ధోకా చేసిన కాంగ్రెస్ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. బీసీలకు కాంగ్రెస్, బీజేపీ కలిసి అడుగడుగునా మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్ల కోసం తాయిలాలు ప్రకటించి గెలిచిన తర్వాత మోసం చేస్తున్నదని విరుచుకుపడ్డారు. ఇదే తరహాలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మైనారిటీకి చెందిన అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికైనా కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు కాంట్రాక్టుల్లో వాటా ఇవ్వాలని, స్థానిక ఎన్నికల్లో 42 శాతం కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జీవో 46 తెచ్చి మోసం చేసిన హస్తంపార్టీకి వచ్చే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. నాడు బీసీల ఓట్ల కోసం 42 శాతం రిజర్వేషన్ల పేరిట రాజకీయ నాటకాలు ఆడారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో అమలైన పథకాలను సైతం ఎత్తివేసి బలహీనవర్గాలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా 42 శాతం కోటా ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని స్పష్టంచేశారు. ఎన్నికలకు ఎందుకంత తొందర అని నిలదీశారు. రేవంత్ సర్కారును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మహిళా నేత తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ బీసీలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. జీవో 46 జారీ చేసి బలహీనవర్గాలకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు ఏనాడూ పార్లమెంట్లో బీసీ బిల్లుల కోసం కొట్లాడలేదని ఆరోపించారు. కానీ ఇక్కడ రేవంత్‌రెడ్డి మాత్రం తెగ హడావుడి చేశారని దుమ్మెత్తిపోశారు. ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి వెళ్లి డ్రామాలు ఆడారని ధ్వజమెత్తారు. ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లిన ఆయన ఏనాడూ బీసీ బిల్లుల ఆమోదానికి ప్రధాని మోదీ, రాష్ట్రపతిని ఎందుకు కలువలేదని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు పెడుతామని ప్రకటించారు.