నాయకుడంటే పదవిని అడ్డుపెట్టుకుని పది రాళ్లు వెనుకేసుకునేవాడు కాదు… తనను నమ్మిన ప్రజల కోసం ఎంతకైనా వెనుకాడకుండా, వెన్ను చూపకుండా.. ‘మీకు నేనున్నాను, మేమందరం ఉన్నాము… మీ కష్టాలు మావి..’ అంటూ… బాధితుల్లో భరోసా నింపేవాడు నాయకుడవుతాడు. అలాంటివారే ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ఇందిరమ్మ పాలన తెస్తామంటూ గొప్పలు చెప్పుకొనే ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లా నడి మధ్యన, కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సర్కార్ బుల్డోజర్లు నిరుపేదల గుడిసెలను కూల్చాయి. బడుగు జీవుల బతుకులను ఛిద్రం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతిని ఎండగట్టేందుకు ఖమ్మంలోని బాధితుల వద్దకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన యావత్తు తెలంగాణ సమాజాన్ని కదిలించిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో గుడిసెలు కూలిపోయి, తినడానికి తిండిలేక, నిత్యావసర వస్తువులు లేక, సొంత రాష్ట్రంలో పరాయి వాళ్లుగా, దొంగలుగా, దోపిడీ దారులుగా, సంఘ విద్రోహులుగా, ప్రభుత్వ భూముల కబ్జా కోరులుగా చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల్లో గునపం దించేలా యువనేత కేటీఆర్ చేసిన పర్యటన సాగింది. ఈ పర్యటనకు బాధితులే కాదు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతోపాటు యువనేతతో కలిసి అడుగులో అడుగేసి బాధితుల పక్షాన నిలబడ్డారు. బాధితుల ఇండ్లన్నీ కూలిపోయి, బుల్డోజర్ల దెబ్బకు యుద్ధభూమిలా మారిన ప్రాంతానికి వెళ్లిన కేటీఆర్‌ను చూసి బాధితులంతా ఆత్మీయంగా కౌగిలించుకుని, కన్నీటి పర్యంతమవుతూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఖమ్మం భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితుల కష్టాలు కండ్లారా చూసిన తర్వాత వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రూపం… మీకు మేమున్నాము.. మీరు ఎక్కడైతే ఇండ్లు కోల్పోయారో అక్కడే ఇండ్లు నిర్మించుకుని గృహప్రవేశాలు చేసేలా మీకు అండగా ఉంటాం.. అవసరమైతే న్యాయస్థానంలో న్యాయపోరాటానికి మీకు తోడుగా ఉంటాం.. అంతేకాదు.. కోర్టు ఖర్చులన్నీ మేమే భరిస్తాం.. మీరు మాత్రం ఇక్కడున్న ముగ్గురు మంత్రుల దొంగ మాటలు, మాయ మాటలు నమ్మొద్దు.. చివరి వరకు మీతో మేముంటాం..’ అని వందల మంది కరతాళ ధ్వనుల నడుమ కేటీఆర్ ఇచ్చిన భరోసా బాధితుల కన్నీటి చుక్కలను తుడిచేసింది… వేలగొంతుల భరోసానుకల్పిచింది.
కర్కశ కాంగ్రెస్ సర్కార్ మూడు రోజులుగా పేదల ఇండ్లు కూల్చివేయడంతో సర్వస్వం కోల్పోయి రోడ్డున పడిన నిరుపేదల గొంతులు కదిలాయి. వారి స్వరం రెట్టింపు అయింది. ‘అన్నా మాకు ఇలాంటి భరోసా ఇంతవరకూ ఎవరూ ఇవ్వలేదన్నా…’ అంటూ కేటీఆర్‌ను ఆలింగనం చేసుకుని ఆయనలో వారి భవిష్యత్తును చూసుకున్నారు.
పదిహేనేండ్లుగా కూలి పనులు చేసుకుంటూ ఖమ్మంలో కిరాయిలు కట్టలేక.. అయిన కాడికి అప్పులు చేసి ఇండ్లు నిర్మాణం చేసుకున్నారు. కరెంటు, నీళ్ల సౌకర్యం లేకపోయినా.. బతుకు జీవుడా అంటూ పిల్లలను పోషించుకుంటూ వెళ్లదీస్తున్నారు. అలాంటి నిరుపేదల జీవితాలపై బుల్డోజర్లు దింపిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నటికీ చెరిగిపోని తప్పును చేసింది. సరిగ్గా ఐదు రోజుల కిందట అక్కడ నివాసం ఉంటున్న పేదలకు ఇంకా తెల్లవారక ముందే ఆ కాలనీలో కుటుంబాలన్నీ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఉన్నట్టుండి రాకాసి యంత్రాల్లాంటి బుల్డోజర్ల శబ్దం.. వందలాది మంది పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లిందది. ఇండ్లలోని వాళ్లంతా ఉలిక్కిపడి లేచారు. ఒక్కసారిగా బయటకు పరుగెత్తి ఏం జరుగుతున్నదో తెలియక అయోమయానికి గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల సూచన మేరకు ఆ బుల్డోజర్లు క్షణాల్లోనే పేదల ఇండ్లన్నీ కూల్చివేసి వారి బతుకులు రోడ్డున పడేశాయి. 12 ఏండ్లుగా భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న నిరుపేదల నివాసాలను గంటల వ్యవధిలోనే నేలమట్టం చేశాయి. సుమారు 700 ఇండ్లను కూల్చడంతో నీడ కోల్పోయిన బాధిత ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. నిరుపేదలు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నా.. వారి ఆర్తనాదాలు చెవికెక్కని అధికారులు కూల్చివేతలను ఆపకుండా దమనకాండను కొనసాగించారు. ఆ రాకాసి యంత్రాల భీకర శబ్దాల నడుమ పూట గడవని పేదల గుండెలోతుల్లోంచి పెకిలివస్తున్న ఆర్తనాదాలు ఈ రాక్షస ప్రభుత్వానికి అరణ్య ఘోషగా మారాయి.
సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ పేదల వద్దకు వచ్చిన కేటీఆర్ నిజంగా బాధితుల్లోనే కాదు, అక్కడున్న వేలాది మంది మనసులు గెలుచుకున్నారు. అప్పటి వరకూ కనీసం తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియక వారి వద్దకు కనీసం వారి బంధువులను సైతం వెళ్లనీయకుండా దుర్మార్గంగా వ్యవహరించిన ఈ ప్రభుత్వానికి కేటీఆర్ పర్యటన చెంపపెట్టులా మారింది. ఖమ్మం భూదాన భూముల బాధితుల గురించి మాట్లాడటానికి కూడా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు ఇష్టపడలేదు. కానీ కేటీఆర్ పర్యటిస్తుండగానే హుటాహుటిన హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. ఖమ్మంలో బాధితులను, బాధితులకు భరోసాగా నిలుస్తున్న వాళ్లను హేళన చేస్తూ మాట్లాడారు. కనీస మానవత్వం లేకుండా బాధితులనే కించపరిచారు. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఖమ్మంలో గుడిసెలు కోల్పోయిన బాధితుల ఆక్రందనను, ప్రభుత్వ దమననీతిని బయటి ప్రపంచానికి తెలిసేలా చేసిన కేటీఆర్ పర్యటనలో ఆయన వేసిన ప్రతి అడుగూ కొన్ని వేల అడుగులను కలుపుకుంటూ ముందుకు కదిలింది. నాయకుడంటే ఇలా ఉండాలని అనిపించింది. బాధితుల ముఖాల్లో ఒక నమ్మకాన్ని నింపింది.