సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా కేంద్రంగా గ్రీన్ ఫీల్డ్ హైవే సెగలు పుట్టిస్తుంది. హెచ్ఎండీఏ ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ హైవే చిన్న, సన్నకారు రైతుల భూములే లక్ష్యంగా దూసుకువస్తోంది. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణంతో జీవనాధారం కోల్పోతున్నామని రైతులు మండిపోతున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ బాధితులు సోమవారం పెద్ద ఎత్తున హెచ్ఎండీఏకు చేరుకొని ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా రైతులతో చెలగాటం ఆడుతుందని, చిన్న, సన్నకారు రైతులకు సాగు చేసుకునే భూములే లేకుండా చేసి, వారి మనుగడ ప్రశ్నార్థకంగా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు మధ్య రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణానికి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో నగరం నలు వైపులా 10 రేడియల్ రోడ్లు రానుండగా.. ఇప్పటికే రేడియల్ రోడ్-1ను ఫ్యూచర్ సిటీ మార్గంలో నిర్మించనున్నారు. తాజాగా ఔటర్ నుంచి వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిట్యాల్ వరకు రేడియల్ రోడ్డు-2ను నిర్మించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 100 మీటర్ల వెడల్పుతో సుమారు 52కిలోమీటర్ల మేర నిర్మించే రోడ్డు కోసం శంషాబాద్, షాబాద్, కొందుర్గ్, చౌదర్గూడెం, మెయినాబాద్, పరిగి మండలాల పరిధిలోని25గ్రామాల్లోని వ్యవసాయ భూముల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మెజార్టీ భూములన్నీ కూడా సాధారణ రైతుల వద్దనే ఉండగా, రేడియల్ రోడ్లతో తమ జీవనాధారమే కోల్పోతున్నామని పరిగి మండలానికి చెందిన రైతులు రోడ్డెక్కారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, విలువైన, సారవంతమైన వ్యవసాయ భూములను కాంగ్రెస్ సర్కారు బలి చేస్తుందని పరిగి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 300 ఫీట్ల రోడ్డుతో తమ ప్రాంతానికి వచ్చే ప్రయోజనం ఏమిటో రేవంత్ సర్కారు చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కంపెనీలకు చెందిన భూములకు డిమాండ్ తీసుకు రావడానికే గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణం పేరిట రైతులను రోడ్డున పడేస్తున్నారని రైతు నర్సిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న 30 ఫీట్ల రోడ్డుకు రెండేళ్లలో తట్టెడు మట్టి పోసి గుంతలు పూడ్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం… పేదల భూములను లాక్కోని నిర్మించే గ్రీన్ ఫీల్డ్హైవే ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. అయితే తాజా నోటిఫికేషన్ నుంచి తమ గ్రామాలను తొలగించాలని, సాగు భూములను భారీ రహదారులకు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.