Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అభిమానుల్లో ఉత్సాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ‘గబ్బర్‌సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్‌తో మళ్లీ చేతులు కలపడంతో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’పై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 26, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు ముందే బిజినెస్ పరంగా దూసుకుపోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. పవన్ స్టైల్‌కు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా మేళవించి హరీశ్ శంకర్ కథను తెరకెక్కించినట్లు సమాచారం. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ‘గబ్బర్‌సింగ్’ వంటి పవన్ సినిమాలకు ఆయన ఇచ్చిన ఆల్బమ్‌లు సూపర్ హిట్ కావడంతో ఈసారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పవన్ సిగ్నేచర్ మేనరిజమ్స్‌ను గుర్తు చేసే ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ బీట్లు జత కావడంతో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అంతకుముందు వచ్చిన ‘దేఖ్లేంగే సాలా’ పాట కూడా మంచి స్పందన తెచ్చుకుంది.
ఇంకా రెండు పాటలు విడుదల కావాల్సి ఉండగా, మార్చి రెండో వారంలో ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక డిజిటల్ బిజినెస్ విషయానికి వస్తే, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఓటీటీ హక్కులను ప్రముఖ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.80 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పవన్ గత చిత్రం ‘ఓజీ’ ఓటీటీలో మంచి ఆదరణ పొందిన నేపథ్యంలో ఈ డీల్ చాలా సులువుగా క్లోజ్ అయిందని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా ఈ చిత్రం మంచి మార్కెట్ సృష్టిస్తోంది. మైత్రీ సంస్థ స్వయంగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో ప్రముఖ హోంబలే సంస్థ రిలీజ్ బాధ్యతలు తీసుకోనుందనే టాక్ వినిపిస్తోంది. ఓవర్సీస్ హక్కులపై కూడా చర్చలు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.