కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, పన్నుల వసూళ్లు, సమాఖ్య వ్యవస్థకు సంబంధించి మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. రాష్ర్టాల అధికారాలపై కేంద్రం పెత్తనం మరోసారి చర్చకు దారితీసింది. ఇందుకు కారణం తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పదమైన గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్ట సవరణ బిల్లు-2026కు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం తెలుపడమే. ఈ బిల్లు ప్రకారం గనులు, ఖనిజాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు విధించే చాలా రకాల పన్నులు ఆగిపోతాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయవేడి రాజుకుంది. రాష్ర్టాల అధికారాల్లోకి కేంద్రం చొచ్చుకురావడం ఏందని, ఇది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గనుల బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రధానమంత్రికి, బిల్లుకు ఆమోదం తెలుపవద్దంటూ రాష్ట్రపతికి విజ్ఞాపనలు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరి రాజ్యాంగం ప్రసాదించిన సమాఖ్య స్ఫూర్తిపై దాడి అని రాజకీయపక్షాలు మండిపడుతున్నాయి. గనుల సంపదను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముగింపు తర్వాత రాజకీయ వేడి రాజుకున్నది. సమావేశాల చివరిరోజు గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఇతర బిల్లులలాగే ఎలాంటి చర్చ జరపకుండా రాజ్యసభ ఆమోదం తెలిపింది. సవరణ బిల్లులో కొత్తగా సెక్షన్ 9డీని పొందుపర్చారు. ఈ సెక్షన్ ప్రకారం గనులపై, ఖనిజాలు కలిగిన భూములపై కేంద్రం విధించిన షరతులు, ఆంక్షల మేరకు తప్ప, ఖనిజాల నాణ్యత, పరిమాణం, రాయల్టీ ఆధారంగా పన్నులు, లెవీలు, సెస్‌లు, ఇతర రుసుములు విధించే స్వతంత్ర అధికారం, బకాయిలను వసూలు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. దీంతో గనుల రంగంలో ఏకరూప ఆర్థిక విధానం సాధ్యమవుతుందని కేంద్రం చెప్తున్నది. కొత్త చట్టంతో లిథియం, కాపర్, కోబాల్ట్ వంటి ఖనిజాల తవ్వకంలో ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సవరణ చట్టం అమల్లోకి వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన, వసూలు చేసిన పన్నులను తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. గనులు, ఖనిజాలపై పన్నుల విధింపు వివాదం పూర్వాపరాల్లోకి వెళ్తే, 2024లో సుప్రీంకోర్టు వెలువరించిన కీలక తీర్పు గురించి తెలుసుకోవాలి. గనులపై పన్నులు విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంటుందని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టంచేసింది. రాష్ర్టాల అధికారాన్ని గనులు, ఖనిజాలు అభివృద్ధి నియంత్రణ చట్టం-1957 పరిమితం చేయబోదని తేల్చిచెప్పింది. తీర్పు అమలును వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. 2005 ఏప్రిల్ 1 నుంచి చెల్లించాల్సిన బకాయిలనూ రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చింది.
రాష్ర్టాల హక్కులను కాపాడేలా సుప్రీంకోర్టు తీర్పు రక్షణగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ర్టాల అధికారాలను పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాన్నే సవరణ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బిల్లును తెచ్చింది. బిల్లులో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాలను పేర్కొన్నది. విభిన్నమైన పన్నుల కారణంగా
గనుల రంగంలో అనిశ్చితి నెలకొన్నదని తెలిపింది.
అనేక రకాల చార్జీలు, ఊహించలేని పన్నుల విధానం, వేర్వేరు రేట్లు, గత తేదీల నుంచి కూడా వర్తించే రుసుములను అరికట్టేందుకు బిల్లు రూపొందించినట్టు వివరించింది. ఆర్థిక భారాల కారణంగా గనుల రంగం కుదేలవుతుందని, ఖనిజాల వెలికితీతను నిరుత్సాహపరుస్తుందని, వస్తువులు, సేవల ధరలు కూడా పెరుగుతాయని తెలిపింది. సవరణ బిల్లుతో అలాంటి సమస్యలను అధిగమించవచ్చని, గనుల రంగంలో ఏకరూపతతో స్థిరత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తంచేసింది. గెజిట్ నోటిఫికేషన్ తర్వాత సవరణ చట్టం అమల్లోకి రానున్నది.
మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ర్టాల నుంచి కేంద్ర ప్రభుత్వం వివిధ పన్నుల రూపంలో పెద్దఎత్తున నిధులను సమకూర్చుకుంటున్నది. కానీ తిరిగి అదే స్థాయిలో నిధులను తిరిగి మంజూరు చేయడంలేదు. ఈ నేపథ్యంలో గనులపై రాష్ర్టాలు స్వతంత్ర పన్నులు విధించవద్దంటూ కేంద్రం తీసుకొచ్చిన సవరణ బిల్లుతో రాష్ర్టాల ఆదాయానికి గండి కొట్టినట్టే అవుతుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభావం పడుతుంది.
ఇప్పటికే దేశంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినేలా కేంద్రం ఏకపక్ష విధానాలను అమలు చేస్తున్నది. అధికారాలను కేంద్రీకృతం చేసుకోవాలని చూస్తున్నది. ఇప్పుడు గనుల సవరణ చట్టం అందుకు మరో నిదర్శనంగా నిలుస్తున్నది. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వెనుక ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నట్టు కనిపిస్తున్నది. అస్మదీయులైన బడా పారిశ్రామికవేత్తలకు గనులను అప్పనంగా కట్టబెట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాల అడ్డు తొలగించుకున్నట్టు కనిపిస్తున్నది. కొత్త చట్టంతో ప్రైవేట్ కంపెనీలు ఎక్కడ కావాలంటే అక్కడ గనులను దక్కించుకోవడానికి లైన్ క్లియర్ చేసినట్టు అయింది.
ఇప్పటివరకు గనుల తవ్వకంతో రాష్ర్టాలకు పలు రకాలుగా నష్టం వాటిల్లుతున్న ది. అటవీ, పర్యావరణం, జనావాసాలపై ప్రభావం పడుతున్నది. కాబట్టి కొన్నిరకాల నష్టాలను పూడ్చుకోవడానికి రాష్ర్టాలు కూడా పన్నులు, సెస్‌లను విధిస్తుంటాయి. ఇవి వివిధ రాష్ర్టాల్లో వేరుగా ఉంటాయి. కానీ కేంద్రం ఏకరూపత పేరుతో ఏకపక్ష ధోరణి అనుసరిస్తున్నది.
జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు పుష్కలమైన ఖనిజ సంపదకు నిలయాలు. ఆ రాష్ర్టాలకు ప్రధాన ఆదాయం గనులపై విధించే పన్నుల ద్వారా వస్తుంది. ఇప్పుడు సవరణ చట్టంతో ప్రధానంగా ఆ రాష్ర్టాల ఆర్థిక వనరులపై దెబ్బ పడుతుంది. ఇది ద్రవ్య సమాఖ్య వాదానికి విఘాతం కలిగిస్తుంది. ఇప్పటికే రాష్ర్టాల ప్రభుత్వాలు గనుల కంపెనీల నుంచి వసూలు చేసుకోవాల్సిన బకాయిలు రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ అంచనా. కొత్త సవరణ చట్టం అమల్లోకి వస్తే ఆ మొత్తం రాష్ర్టాలకు దక్కకుండా పోతుంది. సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ర్టాలు, పన్నులు వసూలు చేసే అధికారాన్ని కోల్పోతాయి.
సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్రం తీసుకొస్తున్న చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చట్టంపై న్యాయపోరాటం చేస్తామని కేరళ సీఎం వీడీ సతీశన్ తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్రం కబ్జా చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ర్టాల సంపదను రాష్ర్టాల ప్రజల కోసమే ఖర్చు పెట్టాలని ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ డిమాండ్ చేసింది. మైనింగ్ వల్ల పర్యావరణపరంగా, సామాజికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆదాయానికి గండి కొట్టడం సరికాదని పేర్కొన్నది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రతిపక్షాల మాటలపై మౌనవ్రతం పాటించే కేంద్రం సమాధానం ఏంటో తెలిసిందే.
కేంద్రం చట్టాలు తీసుకొచ్చేటప్పుడు సమా ఖ్య స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరమున్నది. కానీ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. కేంద్రీకృత అధికార వ్యవస్థను విశ్వసిస్తూ రాష్ర్టా ల హక్కులకు విఘాతం కలిగిస్తున్నది. అటవీ హక్కులను కాలరాస్తూ, గిరిజనులు, ఆదివాసు ల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికిపావుశేరు అప్పనంగా ప్రైవేట్‌కు కట్టబెడుతూ ఏకపక్ష వైఖరిని అనుసరిస్తున్నది. ఇప్పుడు కొత్తగా కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ గనులను కట్టబట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నది. దేశ సంపదను అందినకాడికి తవ్వుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది. అయితే దేశంలోని వివిధ రాష్ర్టాల్లో విభిన్న పరిస్థితులు, అవసరాలు, పర్యావరణం, ప్రభావం ఉంటాయని కేంద్రం మర్చిపోకూడదు. వీటిని దృష్టిలో పెట్టుకొని, రాష్ర్టాల హక్కులను పరిగణనలోకి తీసుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించాలి. అంతేకానీ ఏకరూపత పేరుతో ఏకపక్షంగా వ్యవహరిస్తే అది రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించినట్టే
– ఇనుగుర్తి సత్యనారాయణ
9704617343