Lean PCOS | సాధారణంగా పీసీవోఎస్ అంటే అధిక బరువు, క్రమం తప్పిన రుతుక్రమం, మొటిమలు, అవాంఛిత రోమాలు వంటి లక్షణాలు గుర్తుకొస్తాయి. అయితే శరీర బరువు సాధారణ స్థాయిలో ఉన్న మహిళల్లోనూ ఈ సమస్య కనిపించే అవకాశం ఉంటుంది. దీనినే లీన్ పీసీఓఎస్ గా పిలుస్తారు. పీసీఓఎస్ కేవలం రుతుసంబంధమైన సమస్య మాత్రమే కాకుండా శరీరంలోని జీవక్రియలపై కూడా ప్రభావం చూపుతుందనే కారణంతో గత మేలో దీనికి పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గా పేరు మార్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి ఈ సమస్య ఉన్నట్లు అంచనా. భారత్‌లో సుమారు 11.3 శాతం మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సాధారణ శరీర బరువు ఉన్న మహిళల్లో కూడా రుతుక్రమం సక్రమంగా రాకపోవడం, తరచూ రుతుస్రావం మిస్ అవడం, రుతుస్రావం వచ్చినప్పుడు అధిక రక్తస్రావం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో పురుష హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల ముఖం, శరీరంపై అధికంగా రోమాలు పెరగడం, మొటిమలు, చర్మం జిడ్డుగా మారడం, జుట్టు పలుచబడటం లేదా రాలిపోవడం వంటివి కూడా ఉంటాయి. అండోత్సర్గం సక్రమంగా జరగకపోవడం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు, వంధ్యత్వ సమస్యలు కూడా కనిపించే అవకాశముంటుంది.
పీసీఓఎస్‌కు సంబంధించిన జీవక్రియ సమస్యల్లో ఇన్సులిన్ నిరోధకత ముఖ్యమైనది. దీని వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించడంలో శరీరానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ముందస్తు మధుమేహం లేదా టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరిగే వీలు ఉంది. మెడ, చంకలు వంటి ప్రాంతాల్లో చర్మం నల్లబడటం, చర్మంపై చిన్న మాంసపు ముద్దలు రావడం, అధికంగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం కష్టంగా మారడం వంటి సమస్యలు కూడా ఉంటాయి. కొందరిలో అలసట, మానసిక స్థితిలో మార్పులు, ఆందోళన, నిరాశ, నిద్ర సమస్యలు, కటి ప్రాంతంలో అసౌకర్యం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. లీన్ పీసీఓఎస్ అంటే అధిక బరువు లేకపోయినా పీసీఓఎస్‌కు సంబంధించిన హార్మోన్ల, జీవక్రియ మార్పులు ఉండే పరిస్థితి. పీసీఓఎస్ ప్రతి మహిళలో ఒకే విధంగా కనిపించదు. కొందరిలో రుతుక్రమం సక్రమంగా రాకపోవడం, మొటిమలు, ముఖం లేదా శరీరంపై అధిక రోమాలు, జుట్టు పలుచబడటం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో కొన్ని లక్షణాలు మాత్రమే స్వల్పంగా ఉండటంతో సమస్యను గుర్తించకుండా సంవత్సరాల పాటు ఉండే అవకాశం ఉంది. శరీర బరువు ఒక్కటే పీసీఓఎస్‌ను నిర్ణయించే అంశం కాదు. సన్నగా కనిపించే మహిళల్లో కూడా ఇన్సులిన్ నిరోధకత ఉండే అవకాశం ఉంది. ఇన్సులిన్‌కు శరీరం సరిగ్గా స్పందించనప్పుడు దాన్ని భర్తీ చేసేందుకు శరీరం మరింత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అధిక ఇన్సులిన్ స్థాయిలు పురుష హార్మోన్ల ఉత్పత్తిని పెంచి, సాధారణ అండోత్సర్గానికి ఆటంకం కలిగిస్తాయి. ఫలితంగా రుతుక్రమం సక్రమంగా రాకపోవడం, మొటిమలు, ముఖం లేదా శరీరంపై అధిక రోమాలు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇన్సులిన్ నిరోధకత ఉన్నా ప్రతి ఒక్కరిలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. చాలామందికి వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తుంది. దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకత ముందస్తు మధుమేహం, టైప్ 2 మధుమేహంతో పాటు ఇతర జీవక్రియ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే పీసీఓఎస్ ఉన్న మహిళలు కేవలం రుతుక్రమం లేదా బయటికి కనిపించే లక్షణాలపైనే కాకుండా తమ జీవక్రియ ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలి. లీన్ పీసీఓఎస్‌లో సాధారణంగా కనిపించే లక్షణాల్లో రుతుక్రమం సక్రమంగా రాకపోవడం లేదా మిస్ అవడం, మొటిమలు, జిడ్డు చర్మం, ముఖం లేదా శరీరంపై అధిక రోమాలు, జుట్టు పలుచబడటం లేదా రాలిపోవడం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు, కారణం స్పష్టంగా తెలియని హార్మోన్ల మార్పులు ముఖ్యమైనవి. శరీర బరువు సాధారణంగా ఉండటంతో పాటు లక్షణాలు కూడా స్వల్పంగా ఉంటే లీన్ పీసీఓఎస్‌ను గుర్తించడం ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం వల్ల భవిష్యత్తులో గర్భధారణకు సంబంధించిన సమస్యలతో పాటు జీవక్రియ ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
పీసీఓఎస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం కూడా ముఖ్యమే. ఈ సమస్య ఉన్న మహిళల్లో ముందస్తు మధుమేహం, టైప్-2 మధుమేహం, గుండె, ఇతర జీవక్రియ సంబంధిత సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. అండోత్సర్గంలో సమస్యలు కూడా ఉంటాయి. అందువల్ల బరువు సాధారణంగా ఉన్నా జీవక్రియ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. లీన్ పీసీఓఎస్‌ను నిర్ధారించడానికి కేవలం ఒక్క పరీక్ష సరిపోదు. వైద్యులు రుతుక్రమ చరిత్ర, కనిపిస్తున్న లక్షణాలు, రక్త పరీక్షలు, హార్మోన్ స్థాయిలు, రక్తంలోని గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలు, అల్ట్రాసౌండ్ స్కాన్ వంటి అంశాలను పరిశీలిస్తారు. ఇలాంటి లక్షణాలకు కారణమయ్యే ఇతర సమస్యలను కూడా ముందుగా తొలగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు, ప్రోలాక్టిన్ హార్మోన్ అధికంగా ఉండే పరిస్థితి, ఇతర హార్మోన్ల సమస్యలను పరిశీలించాల్సి ఉంటుంది. పిసీఓఎస్లో అండోత్సర్గం సక్రమంగా జరగకపోవడం వల్ల గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అందువల్ల సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యమైనది. సకాలంలో గుర్తించడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
లీన్ పీసీఓఎస్‌ను నియంత్రించడంలో జీవనశైలిలో కొన్ని మార్పులు సహాయపడతాయి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం, పీచు పదార్థాలు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే సమతుల ఆహారం తీసుకోవడం, అధికంగా శుద్ధి చేసిన చక్కెరలు, అత్యధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని నియంత్రించుకోవడం ద్వారా ఇన్సులిన్‌కు శరీరం స్పందించే విధానాన్ని మెరుగుపరచవచ్చు. కొందరిలో లక్షణాలు, జీవక్రియ పరిస్థితిని బట్టి వైద్యులు మందులను కూడా సూచిస్తారు. పీసీఓఎస్‌ను కేవలం రుతుక్రమాన్ని సక్రమం చేయడం లేదా మొటిమలను తగ్గించడం వరకు పరిమితం చేయకుండా, మొత్తం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహించాల్సిన సమస్యగా చూడాలి. రక్తంలో చక్కెర, ఇన్సులిన్ నిరోధకత వంటి జీవక్రియ అంశాలతో పాటు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షించాలి. రుతుక్రమం తరచూ సక్రమంగా రాకపోవడం, మొటిమలు తగ్గకుండా కొనసాగడం, ముఖం లేదా శరీరంపై అధికంగా రోమాలు పెరగడం, జుట్టు పలుచబడటం లేదా అధికంగా రాలిపోవడం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది. శరీర బరువు సాధారణంగా ఉందనే కారణంతో ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం, అవసరమైనప్పుడు రక్త పరీక్షలు, హార్మోన్ పరీక్షలు, రక్తంలో చక్కెర-ఇన్సులిన్ స్థాయిల పరిశీలన వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను గుర్తించవచ్చు. ప్రారంభ దశలో గుర్తించి క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉండటం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంతో పాటు దీర్ఘకాలిక జీవక్రియ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.