హైదరాబాద్, ఆగస్టు14 (నమస్తే తెలంగాణ): సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ అవసరాలకు మించి ఏపీ నీటి వాటాలను డిమాండ్ చేస్తున్నదని, దురాశకొద్దీ నీటి వాటాలను ఆ రాష్ట్రం అడుగుతున్నదని తెలంగాణ సర్కార్ తెలిపింది. ట్రిబ్యునల్ ఎదుట ఏపీ వాదనలను ఖండించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో శుక్రవారం సైతం కొనసాగింది.
ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట ఇప్పటివరకు ఏపీ వినిపించిన వాదనలపై తెలంగాణ తరఫున సీనియర్ అడ్వొకేట్ వైద్యనాథన్ ప్రతివాదనలు వినిపించారు. ఏపీ వాదనలకు ఖండించారు. ఉమ్మడి కేటాయింపులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉన్నదని, ఈ నేపథ్యంలోనే కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని స్పష్టంచేశారు. కృష్ణా లోటు బేసిన్ అని, అయినా ఇరు రాష్ట్రాల అవసరాలకు సరిపడా నీళ్లు వస్తాయని, కానీ ఏపీ ఒక్కటే అడ్డగోలుగా వినియోగించుకుంటున్నదని, వరికి అవసరమయ్యే నీటికన్నా ఎకువగా వాడుతున్నదని తెలంగాణ సర్కార్ నివేదించింది.
ప్రస్తుతం కొనసాగుతున్న నీటి కేటాయింపులు తాతాలికమేనని, అది కేవలం పాలనాపరమైన సౌలభ్యం కోసమేనని, ఆ నీటివాటా శాశ్వతం కాదని వెల్లడించింది. ఉమ్మడి ఏపీకి ట్రిబ్యునల్-2 చేసిన కేటాయింపులను సమీక్షించవద్దని ఏపీ చేసిన వాదన సరికాదని తెలిపింది. ఆవిరి నష్టాలు, తాగు, పారిశ్రామిక అవసరాలు పోగా, సాగుకు రెండు రాష్ర్టాలకు కలిపి 780 టీఎంసీల నీళ్లు ఉంటాయని, అందులో వరికి 400 టీఎంసీలు వాడుకోవచ్చని, తద్వారా 30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడంతోపాటు 42 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లను ఇచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
కృష్ణా నీటిలో తలసరి వినియోగంపై ఏపీ లెక్కలన్నీ తప్పని, కృష్ణాలో కలుస్తున్న గోదావరి, పెన్నా నీళ్లను పరిగణనలోకి తీసుకోవడమే లేదని తెలంగాణ వివరించింది. జల వివాదాల్లేవని ఏపీ చెప్తున్నమాట అబద్ధమని, వివాదాల నేపథ్యంలోనే కేంద్రం నూతన మార్గదర్శకాలు ఇచ్చిందని వెల్లడించింది. ఉమ్మడి ఏపీకి చేసిన కేటాయింపుల్లో 2 రాష్ట్రాల వాటా తేల్చాల్సి ఉన్నదని వైద్యనాథన్ వివరించారు. విభజన చట్టం ప్రకారం ప్రకారం నీటి వాటాల పంపకాలపై బోర్డులకు అధికారం లేదని చెప్పారు. జల కేటాయింపుల విషయంలో పార్లమెంట్‌కు, కేంద్రానికి అధికారం లేదని, ట్రిబ్యునలే అంతిమమని, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతే కేంద్రం టీవోఆర్ ఇచ్చిందని వివరించారు. తదుపరి విచారణను వాయిదా వేస్తూ సెప్టెంబర్16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు విచారణ చేపట్టనున్నట్లు ట్రిబ్యునల్ వెల్లడించింది.