సిద్దిపేట,నవంబర్24: వాతావరణ శాఖ సూచనల మేరకు సిద్దిపేట జిల్లాలో నాలుగు రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాల ప్రభావం వల్ల పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్తో కలిసి జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఆమె సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు చేరుతున్న ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో అతి త్వరలో సీఎం పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను సంబంధిత అధికారులు ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో చేపట్టాలని కలెక్టర్ వెల్లడించారు.అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాల కోసం ఇప్పటికే కేటాయించిన స్థలాల్లో పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియను వెంటనే ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.