కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అదరగొట్టింది. బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా బంతితో మాత్రం ప్రత్యర్థికి చుక్కలు చూపించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. గ్రూప్-2లో భాగంగా కొలంబోలో శ్రీలంకతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో లంకేయులపై 61 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రచిన్ రవీంద్ర ఆల్‌రౌండ్ షో (బ్యాట్‌తో 22 బంతుల్లో 32, బంతితో 4/27)తో ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్‌లో లంక ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్.. నిర్ణీత ఓవర్లలో 168/7కే పరిమితమైంది. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (26 బంతుల్లో 47, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రచిన్‌తో పాటు మెక్కాంచి (23 బంతుల్లో 31 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తీక్షణ, చమీర చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో లంక.. 20 ఓవర్లలో 107/8 వద్దే ఆగిపోయింది. కమిందు మెండిస్ (31) టాప్ స్కోరర్. గ్రూప్-2లో ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరగా తాజా విజయంతో కివీస్ కూడా ఆ రేసులో ముందంజ వేసింది. దీంతో శ్రీలంక అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించగా పాక్ అవకాశాలూ దాదాపుగా ముగిసినట్టే!
ఛేదనలో మొదటి బంతికే వికెట్ కోల్పోయిన లంకేయులు.. ఏ దశలోనూ లక్ష్యం వైపుగా సాగలేదు. ఫస్ట్ బాల్కే పతుమ్ నిస్సంకను క్లీన్‌బౌల్డ్ చేసిన మాథ్యూ హెన్రీ.. మూడో ఓవర్లో అసలంక (5)నూ ఔట్ చేసి లంకను ఆదిలోనే చావుదెబ్బ తీశాడు. దీంతో ఆత్మరక్షణలో పడిన లంకేయులు.. డిఫెన్స్‌కే ప్రాధాన్యమివ్వడంతో పవర్ ప్లేలో ఆ జట్టు 20/2 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఇక 9వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన పార్ట్‌టైమ్ స్పిన్నర్ రచిన్.. వరుస ఓవర్లలో మ్యాచ్ గమనాన్ని పూర్తిగా కివీస్‌కు అనుకూలంగా మార్చేశాడు. 13 బంతుల వ్యవధిలో కుశాల్ (11), రత్నాయకె (10), కెప్టెన్ శనక (3), హేమంత (3)ను బోల్తొ కొట్టించి లంక పతనాన్ని శాసించాడు. అతడి స్పిన్ మాయతో ఆతిథ్య జట్టు పరాభవం ఖరారైంది. కమిందు, వెల్లలాగె (29) కొద్దిసేపు పోరాడినా వారి పోరాటం లంక ఓటమి అంతరాన్ని తగ్గించిందంతే!
బౌలర్లకు సహకరించిన కొలంబో పిచ్‌పై లంక బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి కివీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ ఒడిదొడుకుల నడుమ సాగింది. ఫిన్ అలెన్ (13 బంతుల్లో 23, 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో 3 ఓవర్లకే 30/0తో కివీస్ ధాటిగానే ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. కానీ స్పిన్నర్ తీక్షణ, పేసర్ చమీర వరుస ఓవర్లలో ప్రత్యర్థిని దెబ్బతీశారు. నాలుగో ఓవర్లో బంతినందుకున్న తీక్షణ.. తొలి బంతికే అలెన్‌ను ఔట్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. మరుసటి ఓవర్లో చమీర.. సీఫర్ట్ (8)ను వెనక్కి పంపాడు. ఈ క్రమంలో రచిన్, ఫిలిప్స్ (18) నాలుగో వికెట్‌కు 41 రన్స్ జోడించారు. క్రీజులో కుదురుకుంటున్న ఫిలిప్స్‌ను రెండో స్పెల్‌కు వచ్చిన చమీర.. క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక 12వ ఓవర్లో తీక్షణ రచిన్, చాప్మన్నూ ఔట్ చేసి కివీస్‌ను కోలుకోనీయకుండా చేశాడు. తర్వాతి ఓవర్లోనే వెల్లలాగె.. మిచెల్ (3)ను బోల్తా కొట్టించడంతో ఆ జట్టు 84/6తో నిలిచింది. ఈ స్థితిలో అసలు ఆ జట్టు 120 పరుగులైనా చేయగల్గుతుందా? అనుకుంటున్న తరుణంలో మెక్కాంచితో కలిసి కెప్టెన్ శాంట్నర్ కివీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 16 ఓవర్లకు 98/6తో ఉన్న న్యూజిలాండ్.. 168 చేసిందంటే అది ఈ ఇద్దరి చలవే. ఈ ద్వయం సిక్స్‌లు, బౌండరీలతో రెచ్చిపోయి ఆఖరి 4 ఓవర్లలో 70 పరుగులు పిండుకుంది. అంతేగాక ఏడో వికెట్‌కు 47 బంతుల్లోనే 84 రన్స్ జోడించి కివీస్‌కు మెరుగైన స్కోరునందించింది.
న్యూజిలాండ్: 20 ఓవర్లకు 168/7 (శాంట్నర్ 47, రచిన్ 32, తీక్షణ 3/30, చమీర 3/38); శ్రీలంక: 20 ఓవర్లకు 107/8 (కమిందు 31, వెల్లలాగె 29, రచిన్ 4/27, హెన్రీ 2/3)