Fruits | నర్సాపూర్, ఫిబ్రవరి 14: పండుగలు వస్తున్నాయంటే మార్కెట్లో పండ్ల ధరలు కొద్దిగా పెరగడం సాధారణంగా కనిపిస్తుంటుంది. అయితే అందుకు భిన్నంగా మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో పండ్ల ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. ఆదివారం నాడు మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో పండ్ల వ్యాపారస్తులు పండ్ల ధరలను అమాంతం పెంచి ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారు. పండ్ల ధరలను వింటున్న ప్రజలు బిక్కమొఖం వేస్తున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పండ్ల వ్యాపారులు పండుగను సాకుగా పెట్టుకొని ప్రజల జేబులకు చిల్లులు కొడుతున్నారు. మిగతా రోజులలో సాధారణంగా ఉండే పండ్ల ధరలను నేడు వ్యాపారులు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. అరటి పండ్లు డజన్ రూ.100, పుచ్చపండు రూ.100 నుండి రూ.160, ద్రాక్షపండ్లు కిలో రూ.200, ఆపిల్స్, సంత్ర పండ్లను రూ.100కు 3 చొప్పున విక్రయిస్తున్నారు.
అలాగే జామ పండ్లను కూడా కిలో రూ.140 చొప్పున అమ్ముతూ జనాలను నట్టేట ముంచుతున్నారు. ప్రతి శివరాత్రి పండుగ నాడు పండ్లు కొనాలంటేనే భయం వేస్తుందని, ఈ ధరలను నియంత్రించే అధికారులే లేరా అని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పండ్ల ధరలను నియంత్రించి న్యాయం చేయాలని కోరుతున్నారు.